Saturday, April 27, 2024

ఎవరు స్ఫూర్తి, ఎవరు సమతామూర్తి? – చినజీయర్​ ఫొటోలకు చెప్పుల దండ

హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకోవాలంటే టికెట్​ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన టికెట్​ ధరలను ప్రకటించారు నిర్వాహకులు . కాగా, దీనిపై కొంతమంది సరైన విధానమే అంటూ కితాబులిస్తుంటే.. ఇంకొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా వ్యాపార దృక్పథంతో చేసిన ఏర్పాట్లు అని.. దీని వెనక పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సమతా మూర్తి స్టాట్యూ పేరిట రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల హస్తం కూడా ఉందన్న ఆరోపణలున్నాయి.

కాగా, సమతా మూర్తి సందర్శనకు టికెట్​ ఫీజుగా పెద్దలకు 150, 6 నుంచి 12 ఏళ్లలో లోపు వారికి 75 రూపాయలుగా నిర్ణయించారు. టికెట్​ పెట్టడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల వారు పూజించి, తమ ఇలవేల్పుగా కొలిచే మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలే నిజమైన సమతా మూర్తులని, కొన్ని వర్గాల వారికే పరిమితమైన రామానుజాచార్యుల విగ్రహం సమతామూర్తికి ఎట్లా స్ఫూర్తి అవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా దీనిపై గిరిజనులు, గిరిజిన సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఎందుకంటే వ్యాపార కార్యకలాపాల కోసం చినజీయర్​ స్వామీని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని, అవి రాబట్టుకోవడానికి ఇదో నాటకం ఆడుతున్నారని మండిపడుతున్నారు. చినజీయర్​ స్వామి ఫొటోలకు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి ఒక్క రూపాయి లేదు.. సమతా మూర్తిని దర్శించుకోవడానికి 150 రూపాయల టిక్కెట్టు ఎందుకు..  ఎవరిది వ్యాపారం? అని ప్రశ్నిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement