Sunday, May 5, 2024

Exclusive | మేం కచ్చితంగా గెలుస్తాం.. కేసీఆర్​ను నేను ఏమీ అనలే: మైనంపల్లి

సీఎం కేసీఆర్​ను నేను ఏమీ అనలేదు. నన్ను ఆయన ఏమీ అనలేదు. మెదక్​లో మాకు మంచి పట్టు ఉంది. మల్కాజ్ గిరిలో నేను గెలుస్తా.. మెదక్​లో నా కొడుకు గెలుస్తాడు. కరోనా వంటి మహమ్మారి వచ్చి ఎప్పుడు చనిపోతామే తెలియని పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు బతికి ఉన్నప్పుడు జీవితానికి విలువ అనేది లేకుంటే ఎలా”అని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు.

– ఉమ్మడి మెదక్​, (ప్రభన్యూస్​ బ్యూరో)

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిన్న (సోమవారం) పార్టీ అధిష్టానం, మంత్రి హరీశ్​రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. మెదక్​లో ప్రచారం చేయడానికి హరీశ్​రావు ఎవరు? ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్​గిరి నుంచి తాను, మెదక్​ నుంచి తన కుమారుడు రోహిత్​ పోటీ చేసి గెలుస్తామని అన్నారు. దీన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని ఘాటు వ్యఖ్యలే చేశారు. అంతేకాకుండా.. హరీశ్​రావు గతం గుర్తుంచుకోవాలని, తన నియోజకవర్గం వదిలి ఇతర చోట్ల పెత్తనం చేయడం ఎమిటని ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీశ్​ అడ్రస్​ గల్లంతు చేస్తానని అన్నారు.

- Advertisement -

ఇదంతా ఇలా ఉండగా.. నిన్న సీఎం కేసీఆర్​ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మల్కాజ్​గిరి నుంచి మైనంపల్లికి అవకాశం దక్కింది. అయినా తాను దీనిపై ఎట్లాంటి వ్యాఖలు చేయలేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్​ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో మైనంపల్లికి చోటు కల్పించామని, పోటీ చేయడమా, లేదా అన్నది అతనే నిర్ణయించుకోవాలన్నారు. ఇదే విషయమ్మీద అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్​ ప్రసిడెంట్​, మంత్రి కేటీఆర్​ సైతం స్పందించారు. పార్టీ అంతా మంత్రి హరీశ్​రావుకు అండగా ఉంటుందని, ఎవరు ఎన్ని మాట్లాడినా పార్టీ లైన్​ మీదే ఉంటామన్నారు.

కాగా, ఇవ్వాల (మంగళవారం) తన మనవడి పుట్టు వెంట్రుకలు తిరుమల శ్రీవారి చెంత తీసిన సందర్భంగా మైనంపల్లి మరోసారి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమన్నారు. తన కుమారుడు సమాజ సేవ చేస్తున్నాడని, అతనికి సపోర్టుగా తాను ఉంటానన్నారు. నిన్న తాను వ్యక్తిగతంగా మాట్లాడనని, మెదక్​, మల్కాజ్​గిరి ప్రజలతో మాట్లాడిన తర్వాత తన కార్యాచరణ ఏంటన్నది ప్రకటిస్తానన్నారు. ప్రజల మద్దతు తమకు ఉందని, తనకు మల్కాజ్​గిరి, తన కుమారుడికి మెదక్​ సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్​ను మరోసారి అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు. తాము ఇద్దరం భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘సీఎం కేసీఆర్​కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా కొడుక్కి మెదక్​ సీట్​ ఇవ్వండి. అక్కడ నా కొడుకు కచ్చితంగా గెలుస్తాడు. పార్టీ అధినేత కేసీఆర్​ను నేను ఏమీ అనలేదు. ఆయన నన్ను ఏమీ అనలేదు. నేను మల్కాజ్​గిరి, నా కొడుకు మెదక్​ నుంచి గెలుస్తాం. కరోనా లాంటిది వచ్చి ఎప్పుడు పోతామో తెలియదు. బతికి ఉన్నప్పుడు జీవితానికి విలువ లేకుండా పోతే ఎలా’’ అంటూ మీడియాతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement