Wednesday, May 1, 2024

Exclusive – జ‌నంలోకి జ‌న‌రిక్ మెడిసిన్ …. రోజు రోజుకి పెరుగుతున్న అమ్మ‌కాలు ..

అమరావతి, ఆంధ్రప్రభ:భారత వైద్య,ఆరోగ్య రంగంలో ప్రస్తుతం ఔషధాల వాడకంపై ఓ అప్రకటిత యుద్ధమే నడుస్తోంది. పేరుమోసిన ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే బ్రాండెడ్‌ ఔషధాలు, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న జనరిక్‌ ఔషధాల వాడకం, వైద్యులు సిఫారసు చేయడంపై కేంద్రానికి, వైద్యవర్గాలకు మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతోంది. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? భారతీయుల్లో వైద్యం ఖరీదైన వ్యవహారం. పేదవర్గాలకు ఆ ఖర్చులు మోయలేని భారం. దేశంలో పేదలే ఎక్కువ. తగిన మందులు కొనుగోలు చేసే శక్తి వారికి లేదు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా జనరిక్‌ మందుల వినియోగా న్ని ప్రోత్సహిస్తోంది. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే కనీసం 50 శాతం తక్కువకే ఇవి అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఈ మందులను వైద్యులు సిఫార్సు చేయడానికి
సందేహిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం ఒత్తిడి చేస్తోంది. తప్పనిసరిగా జనరిక్‌ మందులు సూచించాలని, లేనిపక్షంలో డాక్టర్‌ లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరిస్తోంది. అసలు, మన దేశంలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. తాజా పరిస్థితి ఏమిటి?

ఫార్మా హబ్‌గా భారత్‌
ప్రపంచంలో ఫార్మా ఉత్పత్తుల్లో భారత్‌ది సింహభాగం. ఔషధాల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్‌దే పైచేయి. బ్రాండెడ్‌ మందులే కాదు, జనరిక్‌ మందుల ఉత్పత్తి, ఎగుమతుల్లోనూ నెంబర్‌ వన్‌. అందుకే భారత్‌ను ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌గా పిలుస్తారు. భారత ఔషధ రంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రపంచ గ్లోబల్‌ ఫార్మా మార్కెట్‌లో 13 శాతం వాటా భారత్‌దే. పైగా జనరిక్‌ మందుల విషయంలో మరింత ఎక్కువే. ఉత్పత్తిలోనూ, పరిమాణంలోను, ఎగుమతుల్లోనూ భారత్‌ది పైచేయి. వ్యాక్సిన్ల రంగంలోనూ భారత్‌ది తిరుగులేని ఆధిక్యం. అయితే జనరిక్‌ మందుల వినియోగం విషయంలో అమెరికా సుముఖంగా లేదు. వందల దేశాలు మాత్రం భారతీయ జనరిక్‌ ఔషధాలను వాడుతున్నాయి. భారత్‌లో మాత్రం ఇంకా వాటి వాడకం సంధి దశలోనే ఉంది.

జనరిక్‌ డ్రగ్స్‌ అంటే?
బ్రాండెడ్‌ ఫార్మా కంపెనీలే వీటిని ఉత్పత్తి చేస్తాయి
బ్రాండెడ్‌ ఔషధాల తరహాలోనే ఇవీ ఉంటాయి
వాటి ఫార్ములానే ఉపయోగిస్తారు
నాణ్యత, డోస్‌, సమర్థత, రక్షణ, తయారీ విధానం ఒకటే
పనితీరులోనే ఒకటే ఫలితం
బ్రాండెడ్‌ మందుల ధరలో 50-90 శాతం తక్కువ
పేదలకు వైద్యఖర్చుల్లో ఆదా
జనరిక్‌ మందుల కోసం ప్రత్యేక పరిశోధనలుండవు
అందువల్ల అదనపు ఖర్చు ఉండదు
రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, రాన్‌బాక్సీ, దివీస్‌, సిప్లా కంపెనీల్లో ఉత్పత్తి

ఐఎంఎ అభ్యంతరాలు
జనరిక్‌ మందుల నాణ్యతపై సందేహాలు
0.1 శాతం మందుల నాణ్యతనే పరీక్షించారు
బ్రాండెడ్‌ మందులు సిఫార్సు చేయొద్దనడం సరికాదు
అలాంటప్పుడు ఎందుకు అనుమతులు ఇస్తున్నారు
జనరిక్‌ వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు
వాటిని నివృత్తి చేసే యంత్రాంగం లేదు
ట్రాక్‌ లేకుండా రైళ్లను వేసినట్లు విధానం
వైద్యులపై ఒత్తిడి తగదు

కేంద్రం ఏం చెబుతోంది?
బ్రాండెడ్‌ మందులకు బదులు జనరిక్‌ సూచించాలి
విడివిడి అక్షరాలతో ఆ మందుల పేర్లు రాయాలి
సిఫార్సు చేయని వైద్యులపై కఠిన చర్యలు
అవసరమైతే లైసెన్స్‌ సస్పెన్షన్‌
జనరిక్‌ మందుల వాడకానికి ప్రోత్సాహం
ఐఎంఎ అభ్యంతరాల పరిశీలన
చట్టాల్లో సవరణలు
జనఔషధి పథకం అమలు
దేశవ్యాప్తంగా స్టోర్లు
పేదలకు చౌకగా వైద్యం, ఔషధాలు
ఆ కేంద్రాల నిర్వహణ ప్రైవేటుకు
అందువల్ల నిరుద్యోగులకు ఉపాధి

- Advertisement -

జన్‌ఔషధి సక్సెస్‌
పేదలకు నాణ్యమైన ఔషధాలు అతి చౌకగా అందించే లక్ష్యంతో 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జనరిక్‌ ఔషధాల కార్యక్రమం ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ఊపందుకుంది. చౌకగా జనరిక్‌ మందులు అమ్మే కేంద్రాల ఏర్పాటు అందులో భాగం. అలా జన్‌ ఔషధి పథకం ప్రారంభమైంది. అయితే చాలా నెమ్మదిగా అడుగులు పడ్డాయి. నామమాత్రంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశంలో లక్షల ఫార్మసీ కంపెనీలు, విక్రయ కేంద్రాలు ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక జన్‌ ఔషధి పథకం వేగం పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 743 జిల్లాల్లో 9082 జన్‌ ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. యూపీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో అత్యధికంగా ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఇదీ ప్రణాళిక
దేశవ్యాప్తంగా ఐదేళ్లలో జన్‌ ఔషధి కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని తలపెట్టిన కేంద్రం ఇందుకు లక్ష్యం నిర్దేశించుకుంది. 2021 -2025 మధ్య 10,500 కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement