Wednesday, May 15, 2024

లాభాల్లోకి స్టీల్ ప్లాంట్.. ప్రైవేటీకరణ ఎందుకు?

కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందని, అందుకే ప్రైవేట్‌పరం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. కేంద్రం తీరును నిరసిస్తూ.. కార్మిక సంఘాలు స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ ఎదుట బైఠాయించి, గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్చిలో స్టీల్‌ ప్లాంట్ లాభాలు సాధించి పెట్టింది. రికార్డు స్థాయిలో ఉత్పత్తిని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18 వేల కోట్ల టర్నోవర్‌ సాధించింది

గత నాలుగు నెలల్లో ఏకంగా రూ. 740 కోట్ల నిరక లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ పీకే రథ్ వెల్లడించారు. రూ.18 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించినట్టు తెలిపారు. ఈ ఏడాది అమ్మకాల్లో 13 శాతం వృద్ది సాధించామని చెప్పారు. మార్చిలో 7లక్షల 11వేల టన్నుల ఉక్కు 3వేల 300కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. కర్మాగారం చరిత్రలో ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ భారీ లాభాలను అర్జించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అవసరంలేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement