Monday, May 6, 2024

విశాఖ శారదా పీఠంపై కావాలనే రాజకీయ ముద్ర.. స్వాత్మానందేంద్ర స్వామీజీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖ శ్రీ శారదా పీఠంపై కొందరు రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం చేశారని, తాము ఏ పార్టీ పక్షాన నిలబడమని, ధర్మం పక్షాన నిలబడతామని పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ స్పష్టం చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి 26వ తేదీ వరకు 16 రోజుల పాటు- హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన లక్ష చండీ మహాయజ్ఞం వివరాలను వెల్లడించారు. ఎప్పుడో శివాజీ యాజంలో జరిపిన లక్ష చండీ యజ్ఞాన్ని ఇప్పుడు తాము కురుక్షేత్రలో నిర్వహించామని వెల్లడించారు. భారతీయ హైందవ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంతో చేపట్టిన యాగం దిగ్విజంగా పూర్తైందని స్వాత్మానంద సంతోషం వ్యక్తం చేశారు. ఈ భూమండలంపై లక్ష చండీ మహా యజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత విశాఖ శ్రీ శారదా పీఠానికే దక్కుతుందని, భవిష్యత్‌ తరాలకు ఈ వివరాలను అందించే ఉద్దేశంతో డాక్యుమెంటరీని రూపొందించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా లక్ష చండీ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై 8 నెలల పాటు కసరత్తు చేశామని వివరించారు. అనేక గ్రంథాలను తిరగేసిన తర్వాత శాస్త్రీయ కోణంలో లక్ష చండీ యజ్ఞం నిర్వహణపై ప్రణాళిక రచించామని ఆయన వివరించారు. భవిష్యత్‌లో ఈ యజ్ఞాన్ని తలపెట్టాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని అన్నారు. హిందూ జాతిని జాగృతం చేసేందుకే 22 రాష్ట్రాల నుంచి 2200 మంది రుత్విక్కులు యజ్ఞంలో భాగస్వాములయ్యారని తెలిపారు. యజ్ఞంలో పంచాక్షరీ హవనం కూడా నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.

పీఠానికి, రాజకీయాలకు సంబంధం లేదు

శారదా పీఠానికి అనేక రంగాల వారు వస్తుంటారని, అందులో రాజకీయ నాయకులూ ఉంటారని స్వాత్మానంద వెల్లడించారు. రాజకీయ పార్టీల కోసం పూజలు చేయట్లేదని, అమ్మవారి అనుగ్రహం కోరుకున్న వారికి పీఠంలో రాజశ్యామల యాగం చేశామని ఆయన తెలిపారు. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని తాము ఆ యాగం చేయలేదని స్వాత్మానంద చెప్పుకొచ్చారు. ఎవరు కోరినా తాము రాజశ్యామల యాగం చేస్తామని స్పష్టం చేశారు. రాజశ్యామలా దేవి అనుగ్రహం అందరికీ ఉండాలనే తమ పీఠం భావిస్తుందని చెప్పారు. విశాఖ శారదా పీఠం ఎవరికీ వత్తాసు పలకదని, హిందూ ధర్మం వైపే నిలబడుతుందని స్వాత్మానంద వ్యాఖ్యానించారు. శారదా పీఠానికి వ్యక్తిగత ఆలోచనలు ఉండబోవని, సమాజ హితం కోసం మాత్రమే పని చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement