Sunday, May 5, 2024

ప‌ద్మ‌ అవార్డు తిరస్కరించిన గాయని..  స్థాయికి తగదన్న సంధ్య ముఖ‌ర్జీ

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డును తిరస్కరించిన వ్యక్తుల జాబితా పెరుగుతోంది. ఇప్ప‌టికే పద్మవిభూషణ్‌ను పశ్చిమ్ బెంగాల్ మాజీ సీఎం, సీపీఎం సీనియ‌ర్ నేత‌ బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా, అదే బెంగాల్‌కు చెందిన మరొకరు పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ (90) పద్మశ్రీ అవార్డును తిర‌స్క‌రించారు. ప‌ద్మ‌శ్రీ జూనియర్ ఆర్టిస్ట్‌‌కు ఎక్కువ అర్హమైందని, తన స్థాయికి తగదని ఆమె పేర్కొన్నారు. 90 ఏళ్ల వయసులో తనకు పద్మశ్రీకి ఎంపికచేయడం అవమానంగా భావించారని ఆమె అన్నారు. అవార్డుల జాబితాలో పద్మశ్రీగా పేరు పెట్టడానికి ఆమె సమ్మతి కోరుతూ కేంద్ర అధికారులు సంప్రదించిన సమయంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు.

పద్మశ్రీ గ్రహీతగా తన పేరును ప్రకటించినా.. తీసుకోడానికి సిద్ధంగా లేనని ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన ఉన్నతాధికారులకు నా తల్లి చెప్పారని సంధ్య ముఖర్జీ కుమార్తె సౌమి సేన్‌గుప్తా తెలిపారు. గాయనిగా దాదాపు ఎనిమిది దశాబ్దాల జీవితంలో 90 ఏళ్ల వయసప్పుడు పద్మశ్రీకి ఎంపిక కావడం గాయకురాలిగా ఆమె స్థాయిని కించపరచడమే అని సేన్‌గుప్తా అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ నుండి ప‌ద్మ పుర‌స్కారాన్ని తిరస్కరించిన రెండవ వ్యక్తిగా ఆమె నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement