Saturday, April 27, 2024

TS Health : గ‌ర్భ‌సంచిలో రెండు కిలోల గ‌డ్డ‌.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఫైబ్రాయిడ్‌ని తొల‌గించిన డాక్ట‌ర్లు

ఓ మ‌హిళ‌కు చాలా కాలంగా పిల్ల‌లు క‌ల‌గ‌డం లేదు. ముందు పెద్ద పెద్ద ప్రైవేటు అస్ప‌త్రుల‌కు తిరిగింది. గొప్ప పేరున్న డాక్ట‌ర్ల‌ను కలిసింది. వాళ్ల ట్రీట్‌మెంట్‌తో ఎటువంటి ఉప‌యోగం లేదు. పైగా గ‌ర్భ‌సంచి తొల‌గించాలి, లేకుంటే నీ ప్రాణానికే ముప్పు అని చెప్పారు. ఏం చేయాలో తెలియ‌క అంద‌రు దేవుళ్ల‌కు మొక్కుకుంది. త‌న‌కు సంతానం క‌లగాల‌ని, మొక్కు చెల్లించుకుంటాన‌ని కోరుకుంది. అయినా ఫ‌లితం లేదు. చివ‌రాఖ‌రికి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్లింది.

ఇప్పుడా మ‌హిళ‌కు గ‌ర్భ‌సంచి (హిస్ట‌రేక్ట‌మీ) తొల‌గించ‌కుండానే డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేశారు. ఇది తెలంగాణ ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల ఘ‌న‌త అనే చెప్పుకోవచ్చు. ఆ మ‌హిళ గ‌ర్భ‌సంచిలో ఉన్న రెండు కిలోల ఫైబ్రాయిడ్ మాత్ర‌మే తొల‌గించి, ఆమెకు సంతానం క‌లిగే చాన్స్‌ని స‌జీవంగా ఉంచారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో జ‌రిగింది.

దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అరుదైన ఆప‌రేష‌న్ చేశారు డాక్ట‌ర్లు. సిద్ధిపేట మండలం బురుగుపల్లి గ్రామానికి చెందిన సడిమేల సంతోషి కొంతకాలంగా సంతాన లేమితో బాధపడుతూ అనేక ఆస్పత్రులకు తిరిగింది. ఆ దంప‌తులిద్దరూ తమ బంధువులు, కుటుంబ స‌భ్యులు, చుట్టుముట్టు వారితో అనేక సూటిపోటి మాట‌లు ప‌డ్డారు. అనేక ఇబ్బందులకు గుర‌య్యారు. ఎక్కడికి పోయినా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాత్రం దొర‌క‌లేదు.

ఆ మ‌హిళ క‌డుపులోని గడ్డతో పాటు గర్భ‌సంచిని కూడా తొల‌గించాల్సి ఉంటుంద‌ని చాలామంది డాక్ట‌ర్లు చెప్పారు. అయితే.. నాలుగు రోజుల క్రితం దుబ్బాక హాస్పిట‌ల్‌కి వస్తే డాక్టర్ హేమరాజ్ సింగ్ చూసి అన్ని వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. గర్భసంచి లోపల ఉన్న పైబ్రాయిడ్ మాత్రమే తొలగించి, 2 కిలోల గ‌డ్డను తీసేశారు. ఇదంతా కూడా ఆరోగ్య శ్రీ కింద ఉచిత ఆపరేషన్ చేయడం గ‌మ‌నార్హం. ఇప్పుడా మ‌హిళ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement