Sunday, April 28, 2024

విప్లవ పయనమెటు? తగ్గిపోతున్న మావోయిస్టు కేడర్‌

”మీ పక్కన సైన్యముంది.. మీ కోసం ఈ సైన్యం పనిచేస్తుంది. జీవిస్తాం.. జీవిస్తాం ప్రజల కోసం జీవిస్తాం.. మరణిస్తాం.. మరణిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం.. ఈ సైన్యం మీ పక్కన నిలబడి ఉంటుంది”
– ఓ సభలో ఆర్కే వ్యాఖ్యలు


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పీడిత, తాడిత ప్రజల కోసం వారి హక్కుల కోసం తుపాకీ తూటాతోనే రాజ్యాధికారం సాధ్యమన్న విశ్వాసంతో ముందుకెళుతున్న మావోయిస్టు పార్టీ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, మరోవైపు నక్సలైట్లను ఏరివేస్తామంటున్న కేంద్ర వైఖరితో విప్లవం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదే తరుణంలో పార్టీలోని అగ్రనేతల మరణం కూడా తీరని లోటుగా మారుతోంది. దశాబ్దాల నుంచి పార్టీకే అంకితమై ఉన్న నాయకులు అనారోగ్యంతో మరణించడం, కొంతమంది జనజీవన స్రవంతిలోకి రావడం, మరికొంత మంది అరెస్టులు కావడంతో విప్లవ ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సెంట్రల్‌ కమిటీ.. పార్టీ క్షీణిస్తోందన్న భావనలోకి వచ్చిందని, అందుకోసమే ‘బోల్షవిక్‌ క్యాంపెయిన్‌’ చేపట్టిందని విశ్వసనీయ సమాచారం. పార్టీ నిర్మాణం, రిక్రూట్‌మెంట్‌, శిక్షణా తరగతులు, కేడర్‌లో ఆత్మవిశ్వాసం తగ్గడంతో వాటిని అధిగమించేందుకు కేంద్ర కమిటీ బలమైన వ్యూహాలను అమలుచేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలోనే ముగ్గురు కీలక నేతలను కోల్పోవడంతో కొంత ప్రభావం ఉంటుందని డీకే (దండకారణ్య కమిటీ) కూడా భావిస్తున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్కే మరణంతో తదుపరి ఏవోబీ కార్యదర్శి ఎవరు? ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సమర్ధుడు ఎవరు అన్న కోణంలో పార్టీ అన్వేషిస్తోందని సమాచారం. ఇదే క్రమంలో కేంద్ర కమిటీలోనూ వయోభారంతో నేతలు ఉండడంతోఅసలు విప్లవ పయనమెటు, ఎలా సాగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


అగ్ర నేతల మరణం.. నైర్యాశ్యాన్ని నింపుతోందా?
మావోయిస్టు పార్టీలో అగ్ర నేతల మరణం నైరాశ్యాన్ని నింపుతోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుండగా.. దీనికి సమాధానంగా కొండపల్లి సీతా రామయ్యను చూపిస్తుండడం గమనార్హం. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడైన కొండపల్లి వైదొలిగినప్పటికీ పార్టీ ఏమాత్రం చీలకుండా, మరింత పటిష్టంగా బలపడడంతో నేడు మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. ఇదే బాటలో నేడు పార్టీలో ఎంతమంది మరణించినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు యువరక్తం ఉంటుందన్న భావనను పార్టీ వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం మరణిం చిన ఆర్కేతో పాటు గతంలో చనిపోయిన తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌, రామన్న మృతి మాత్రం కొంత తీరని లోటేనని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కే సైద్ధాంతికంగా, రాజకీయంగా, వ్యూహల రచనలో దిట్టగా పేరొందగా, హరిభూషణ్‌ రిక్రూట్‌మెంట్‌లో నిష్ణాతుడిగా పేరుగాంచాడు. రామన్న సైతం దండకారణ్య కమిటీలో కీలకనేతగా ఎదగడం తో ఈ ముగ్గురి మృతితో డీకేలో కొంత నైరాశ్యం నెలకొన్నదని తెలుస్తోంది.

- Advertisement -

స్టేట్‌, సెంట్రల్‌ కమిటీలే కీలకంగా..
పార్టీ నిర్మాణం, రిక్రూట్‌ మెంట్‌, శిక్షణా తరగతులు తదితర అంశాలను గతం లో లోకల్‌ కమిటీలే పర్య వేక్షించేవి. కానీ మారుతు న్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం స్టేట్‌, సెంట్రల్‌ కమిటీలే పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుండగా, రిక్రూట్‌ మెంట్‌లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్‌ కమిటీలోనూ గతంలో లాగా ఎక్కువ మంది సభ్యులు లేరని, ప్రస్తుతం 20 నుంచి 30 మందితోనే కమిటీ ఉందని సమాచారం. నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

వయోభారంలో కేంద్ర కమిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ.. ప్రజలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న మావోయిస్టు పార్టీ ప్రస్తుతం వయోభారం సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌కు సుమారు 68 నుంచి 70 ఏళ్లు ఉంటాయని సమాచారం. ఇదే క్రమంలో మిగతా నేతలు కూడా ఇంచుమించుగా ఇదే వయసుతో ఉంటారని తెలుస్తోంది. గతంలో కార్యదర్శిగా ఉన్న లక్ష్మణరావు అలియాస్‌ గణపతి ఇప్పటికే తీవ్ర వయోభారం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సమాచారం. కేడర్‌ మొత్తం వయోభారం సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో విప్లవ పయనమెటు సాగుతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రస్తుత కార్యదర్శి బస్వరాజ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. వరంగల్‌ ఆర్‌ఈసీ (ప్రస్తుతం నిట్‌)లో బిటెక్‌ చదువుతుండగా విప్లవం పట్ల ఆకర్షితుడై గణపతి నేతృత్వంలో అంచెలంచెలుగా ఎదిగాడు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌తో కలిసి బస్తర్‌ ప్రాంతంలో అంబుష్‌లో శిక్షణ పొందాడని సమాచారం. కేంద్ర కమిటీలో ఉన్న నేతలంతా వయోధి కులు కావడంతో వీరి తరువాత ఆ స్థాయి నేతలు ఎవరన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. అయితే ప్రస్తుతం గణేష్‌, సుధాకర్‌ కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తదుపరి పార్టీ మార్గదర్శకులుగా వీరిద్దరే ఉంటారన్న చర్చ సాగుతోంది.

మాజీ కార్యదర్శి గణపతి వయోభారం సమస్య తట్టుకోలేక పోలీసులకు లొంగిపోతా రన్న ప్రచారం గతంలో సంచలనమైంది. అనారోగ్య సమస్యలతో గణపతి ఇతర ప్రాంతంలో ఉంటున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. పార్టీ పయనంలో ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎన్ని కష్టాలెదు రైనా.. ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాడతామన్న లక్ష్యం.. వయోభారం, నేతల మరణాలు, అరెస్టులతో సతమతమ వుతున్న తరుణంలో మావోయిస్టు భవిష్యత్‌ ప్రయాణం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా.. కనుచూపు మేరలో విజయాలు ఉన్నాయా.. లేవా అన్నది కూడా మావోల ముందు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది.

తదుపరి ఏవోబీ లీడర్‌ ఎవరు?
ప్రస్తుతం ఏవోబీ కార్యదర్శిగా, సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా వ్యవహరిస్తున్న అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణించడంతో తదుపరి ఏవోబీ లీడర్‌ ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఏవోబీఎస్‌జీసీకి నాయకత్వం వహిస్తున్న గణేష్‌, కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్‌, ఆర్కే ముగ్గురూ ఒకే స్థాయి నేతలు కావడంతో పాటు, గతంలో ఏవోబీకి కార్యదర్శిగా పద్మక్క బాధ్యత వహించింది. ఈ తరుణంలో సుధాకర్‌, గణష్‌, పద్మక్కలు ముగ్గురిలో ఎవరు తదుపరి ఏవోబీ కార్యదర్శిగా వస్తారన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. సుధాకర్‌ గతంలో 1988 నుంచి 2004 వరకు ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌కు కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకే ఇస్తారని తెలుస్తోంది. ఏవోబీ కార్యదర్శి ఎవరన్నది పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement