Wednesday, May 15, 2024

నేడే దీపావళి..ముసురు తగ్గేనా.. పండగ జరిగేనా..


నగర వాసుల్లో పెరుగుతున్న సంశయం..
బాణసంచా అమ్మకాల్లో ఊహించని స్పందన..
రేట్లు భారీగా ఉన్నా అమ్మకాల్లో పురోగతి..

విశాఖపట్నం: చీకటిపై వెలుగు విజయం,. చెడుపై మంచి సాధించిన విజయం.. దీపావళి ప్రతి ఇంటా దివ్య దీపాల కాంతులను నింపుకునే సంతోషాల పండుగ. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం బుధ, గురు వారాల్లో మాత్రమే దీపావళి బాణ సంచా విక్రయించేందుకు అనుమతులు ఇచ్చిన అధికార యంత్రాంగంను కూడా విస్మయపరిచేలా దీపావళి క్రేకర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన ముసురు చిరు జల్లుగా మొదలై వర్షం కురుస్తూనే ఉంది. అయితే అప్పటికి అనేక చోట్ల దీపావళి మందుగుండు సామాన్ల అమ్మకాలు చాలా వరకూ అయిపోయినట్లుగా సమాచారం.

గతంలో బాణ సంచా విక్రేతలు యూనియన్‌లుగా ఏర్పడి వారి పరిధిల్లోని వారి తరపున గ్రూప్‌ లైసెన్సులకు దరఖాస్తులు చేసుకునేవారు. అయితే, కరోనా పూర్తిగా తగ్గకపోవడంతో, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపధ్యంలో దీపావళి స్టాల్స్‌ విషయంలో జిల్లా యంత్రాంగం ఆచితూచి అడుగులు వేసింది. కొన్ని చోట్ల అమ్మకం పాయింట్‌లను నిర్ధేశించినా అక్కడ దీపావళి మందుగుండు సామగ్రి అమ్మకాలు జరపలేదు. కానీ, చాలా చోట్ల ఒక్క బుధవారమే మధ్యాహ్నం నాటికి అత్యధికంగా బాణ సంచా అమ్మకాలు జరిగిపోయినట్లుగా సమాచారం. మధ్యాహ్నం నుంచి పుంజుకున్న ముసురు పరిస్థితులు మిగిలిన విక్రేతలకు ఇబ్బందికి గురి చేసినప్పటికీ గురువారం తెరిపిస్తే తమ సరుకూ పూర్తిగా అమ్ముడైపోతుందని భావిస్తున్నారు.

అలాగే, దీపావళి పండుగ జరుపుకునే వాళ్లంతా ముందు రోజు సాయంత్రం మొదలు దీపావళి రోజున పండుగ సామగ్రి కొనుగోళ్లు జరుపుతారు. నిరాటంకంగా కురిసిన వర్షం కారణంగా దివ్వలు కొట్టేందుకు అమ్మకాలు చేసే చెరుకులు, గోంగూర కాడలు, ఆముదం కాడల అమ్మకాలు ఆగిపోయాయి. దీంతో పూర్ణామార్కెట్‌, అల్లిపురం, దండుబజార్‌ , దొండపర్తి, కంచరపాలెం, గోపాల పట్నం, ఎంవీపీ, పలు రైతు బజార్లు, గాజువాక, మధురవాడ, పీఎం పాలెం, మిథిలాపురి ఉడా కాలనీ, ఆనందరపురం, పెందుర్తి, కురుపాం మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో చెరుకు గెడలూ, ఆముదం కర్రలూ, గోంగూర కర్రలూ అమ్మకాలు చేయాలని ఆశించిన వారికి నిరాశ కలిగింది. పూజాదికాల కోసం వీటితో పాటూ ఇతర పూజా ద్రవ్యాలను కొనుగోలు చేయాల్సిన వారు కూడా బుధవారం కురిసిన నాన్‌స్టాప్‌ వర్షం కారణంగా గురువారం తగ్గితే కొని పూజకు సిద్దం అవుదామని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దీపావళి కొరోనా తగ్గుముఖం పట్టి ప్రజలకు పండగను ఘనంగా జరుపుకోవాలనే ఆకాంక్షను పెంచినప్పటికీ వాతావరణం సహకరించకపోతే ఈ దీపావళి కూడా తుస్సుమంటుందనే అంచనాల ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement