Sunday, May 5, 2024

Karnataka | సీఎం ఎవరన్నది డిసైడ్​ చేస్తం.. హైకమాండ్​ నుంచి త్రీమెన్​ కమిటీ ఏర్పాటు!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్​ పార్టీ సీఎం ఎవరనే దానిపై కసరత్తు చేస్తోంది. స్థానికంగా ఉన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్ది.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ హైకమాండ్​ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కర్నాటకకు పంపినట్టు ఏఐసీసీ చీఫ్​ మల్లిఖార్జున ఖర్జే చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన మరుసటి రోజు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అయితే.. ఈ విషయాన్ని హైకమాండ్‌ నిర్ణయిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆదివారం చెప్పారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. సాయంత్రం శాసనసభ పక్ష భేటీ నిర్వహించి ఆ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని లక్ష్యంగా చేసుకుని.. కర్నాటక ప్రజలు కాషాయ పార్టీని తిరస్కరించారని, వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పరిపాలన అందిస్తామన్నారు.

ఇక.. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలను త్వరితగతిన అమలు చేసేలా చూస్తామని ఏఐసీసీ చీఫ్​ ఖర్గే చెప్పారు. కర్నాటక సీఎం ఎవరన్నది నిర్ణయించడానికి మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు పార్టీ నేతలు దీపక్ బబారియా, జితేంద్ర సింగ్‌ను పరిశీలనకు పంపించారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ వైఫల్యంతో సరిపెట్టుకోలేక పోతున్నదని, అందుకే ఆ పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి విద్వేష రాజకీయాలను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

కాగా, కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 135, బీజేపీకి 66 సీట్లు వచ్చాయి. జనతాదళ్ సెక్యులర్ జెడి(ఎస్) 19 సీట్లతో రేసులో మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌లు పోటీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement