Friday, April 26, 2024

Spl Story | ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అసలు నిందితులను లాక్​ చేయకుండానే నీరుగారుతోందా?

తెలంగాణపై కన్నేసిన బీజేపీ అగ్రనాయకత్వం.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను ఎట్లాగైనా తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసిన ప్లాన్​ బెడిసికొట్టింది. ఈ తతంగంలో ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ఆఫర్​  చేసి, మంతనాలు సాగించే క్రమంలో బీఆర్​ఎస్​ స్ట్రింగ్​ ఆపరేషన్​లో వారే అడ్డంగా బుక్​ అయ్యారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం, వారి వెనకాల ఉన్నదెవరనే విషయాన్ని కనుగొని అసలు నిందితులను లాక్​ చేసే క్రమంలో​ బ్రేక్​ పడింది. ఒకేసారి ఏడుగురు జడ్జిల బదిలీ తర్వాత ఈ కేసు నీరుగారిపోవడం మొదలయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఏం మతలబు జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సోమవారం వెలువరించిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ నిన్న కొట్టివేసింది. కాగా, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారంఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నుంచి అడ్వకేట్ జనరల్ బీఎస్​ ప్రసాద్ అనుమతి పొందారు. బుధవారం ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయిస్తానని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు.

తెలంగాణకు చెందిన నలుగురు శాసనసభ్యులను పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి కొనుగోలు చేయడానికి  సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్​ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ డివిజన్ బెంచ్ సోమవారం కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆదేశాలను తప్పుపట్టలేమని, అందులో జోక్యం చేసుకోలేమని డివిజన్​ బెంచ్​ తేల్చి చెప్పింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి 2022, డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సంబంధించిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. సిట్ దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజారి రామచంద్రభారతి, పోపు సింహయాజీ, రెస్టారెంట్ యజమాని నందుకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఈ తీర్పు వెలువరించింది.

- Advertisement -

విచారణ మెటీరియల్‌ను మీడియాకు యాక్సెస్ చేయకూడదని కూడా న్యాయమూర్తి చెప్పారు. ముఖ్యమంత్రికి పరిశోధనాత్మక సామాగ్రిని ఎవరు అందించారనే ప్రశ్నకు రాష్ట్రం స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సహేతుకమైన సందేహం లేకుండా నిందితులు.. బీజేపీ యొక్క భయాందోళనల ఆధారంగా ఒక నిర్ధారణకు వచ్చినందుకు సింగిల్ జడ్జి ఆదేశాలను తప్పుబట్టారు. ఒకసారి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించిన తర్వాత, అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుందని.. ముఖ్యమంత్రి మీడియాకు బహిరంగ పత్రాన్ని బహిర్గతం చేయడాన్ని దర్యాప్తు సంస్థ మెటీరియల్ లీకేజీగా పరిగణించలేమని ఈ సందర్భంగా దవే కోర్టుకు తెలిపారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేస్తుంటే. బీజేపీ ఆడుతున్న రాజకీయాలను తెలంగాణ ముఖ్యమంత్రి లక్షలాది మంది ఓటర్ల దృష్టికి తీసుకెళ్లడంలో తప్పులేదని ఆయన సూచించారు.

కాగా, ముగ్గురు నిందితులు బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను భారీ డబ్బు ఆఫర్లతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ 2022 అక్టోబర్ 26న రాత్రి హైదరాబాద్ సమీపం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ నుండి సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. బీజేపీలోకి ఫిరాయించేందుకు నిందితులు తనకు రూ.100 కోట్లు, మరో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 కోట్ల చొప్పున ఆఫర్ చేశారని ఆరోపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సిట్​ బృందం పలు కీలక ఆధారాలు కనిపెట్టింది.

ఇక.. ఈ కేసుతో లింకప్​ అయి ఉన్న బీజేపీ ముఖ్య నేతల వివరాలను వారి ఇన్వాల్వ్​మెంట్​కి సంబంధించిన పూర్తి డిటేయిల్స్​ని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బీఎల్​ సంతోష్​ని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులకు దీనిలో ప్రమోయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఆ తర్వాత కేసు కీలక మలుపులు తిరిగడం మొదలయ్యింది. ఉన్నట్టుండి ఏడుగురు జడ్జిలు బదిలీ కావడం, ఆ తర్వాత ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉన్నా.. దాన్ని కూడా ప్రలోభపెట్టి కేసు నీరుగార్చారా? అనే ఆరోపణలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. లేకుంటే సిట్​ దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూస్తే.. ఈ పాటికే కేసు ఓ కొలిక్కి వచ్చేదని చాలామంది రాజకీయ నేతలు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement