Thursday, May 9, 2024

గెలుపు ఎవరిది?

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, విజేతల ఎవరు అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్‌తో పాటు నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానంలోనూ.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం లేదు. ఎవరికీ 50 శాతంపైగా ఓట్లు రాలేదు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్ పరిధిలో మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రామచంద్రరావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం ఏడు రౌండ్లలోని మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 1,04,668 ఓట్లు వచ్చాయి. ఇక ఇండిపెండంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 5,973 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లలో మొత్తం 21,309 చెల్లని ఓట్లను గుర్తించారు. అభ్యర్థి విజయానికి ఇంకా 1,79,175 ఓట్లు కావాల్సి ఉంది. రెండో ప్రాధాన్యతా ఓట్లతోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కొద్దిసేపు గందర గోళం నెలకొంది. అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతలో వచ్చిన బ్యాలెట్ పేపర్ల కన్న … రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయం లో బ్యాలెట్ పేపర్లను సిబ్బంది తక్కువగా చూపుతున్నట్లు తెలుస్తోంది. 8 మంది ఎలిమినేషన్ లో 50 ఓట్లు మిస్ అయినట్లు చూపుతోంది సిబ్బంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా, కాంగ్రెస్ ఏజెంట్లు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల సిబ్బంది సరైన సమాధాన చెప్పకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.

మరవైపు నల్గొండ పరిధిలో ఏడు రౌండ్లు పూర్తయ్యాక… టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3,87,969 ఓట్లు వచ్చాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లకపోవడంతో.. 3,66,333 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం పైగా ఓట్లు రాకపోవడంతో రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి. మరోవైపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో 40 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యే సమయానికి 1312 ఓట్లు రాగా అందులో పల్లాకు 174 ఓట్లు, మల్లన్నకు 149, కోదండరాంకు 193 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement