Monday, April 29, 2024

ఢిల్లీలో హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయం

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ సాగుతోంది. ఓవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంటే… మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తెలంగాణ పీసీసీ చీఫ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి చాలా రోజులైన ఇప్పటికి కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు పీసీసీ రేసులో పోటీ పడుతున్నారు. టీపీసీసీ ఆశావహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే పలవురు ఆశావహులు ఢిల్లీ వెళ్లారు. శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా రేవంత్ తో పాటు పీసీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్ లో చాంతాడంత ఉంది. మరి వాళ్లందరినీ కాదని రేవంత్ కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే కాంగ్రెస్ కు పునర్ వైభవం లభిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. రేవంత్ పీసీసీ అప్పగిస్తే అది పార్టీ ప్లస్సా? మైనస్సా ? అనే ఉత్కంఠగా మారింది.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అప్పగిస్తారంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి కన్ఫార్మ్ చేసిందని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. అయితే, రేవంత్ ఎంపికను కాంగ్రెస్ లోని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో రేవంత్ పై ఫిర్యాదు కూడా చేశారు. వీహెచ్ లాంటి నేతలు అయితే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను కాదని, ఇతర పార్టీలోనుంచి వచ్చిన వారికి పీసీసీ ఎలా ఇస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పీసీసీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, రాష్ట్రంలో పార్టీకి పుర్వవైభవం రావాలంటే.. పక్క మాస్ లీడర్ ఉండాలి. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఇక, బీజేపీ విషయానికి వస్తే.. తెలంగాణలో క్రమంగా తన బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీలో ఆహ్వానించింది. సోమవారం ఈటల కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. భూ కబ్జా ఆరోపణలపై ఈటల రాజేందర్‌ ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో పార్టీ అదిష్ఠానంపై కోపంతో టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. ఆ తర్వాత ఈటల భవిష్యత్తు కార్యాచరణపై అనేక ఊహాగానాలు వచ్చాయి. సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. అయితే వీటన్నిటినీ తోసిపుచ్చి ఈటల బీజేపీలో చేరుతున్నారు. ఇక, ఈటల బీజేపీలో చేరితే పార్టీకి బలం పెరిగినట్లే అని బీజేపీ ఆగ్రనాయత్వం భావిస్తోంది. అంతేకాదు, 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాలో కాషాయ నేతలు ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఢిల్లీలో వేడి పుట్టిస్తున్నాయి. ఇక, భవిష్యత్ లో ఈ రెండు జాతీయ పార్టీలు… అధికార టీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement