Wednesday, May 15, 2024

29 మందికి కనీసం 50 ఓట్లు కూడా పడలేదు

వ‌రంగ‌ల్-ఖ‌మ్మం-న‌ల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స‌స్పెన్స్ వీడ‌లేదు. ఏడు రౌండ్ల ఓట్ల‌ లెక్కింపు పూర్త‌య్యింది కానీ తొలి ప్రాధాన్య‌త ఓట్లతో ఫ‌లితం తేలలేదు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ముందంజ‌లో ఉన్న‌ప్ప‌టికీ.. మెజార్టీ ఓట్లు సాధించ‌లేకపోయారు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపున‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. వ‌రంగ‌ల్-ఖ‌మ్మం- నల్గొండలో పట్టభద్రుల స్థానంలో మొత్తం 3,87,969 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లుబాట కాకుండాపోయాయి. మిగిలిన 3,66,333 ఓట్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా.. ఆయ‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన‌ తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు పోలయ్యాయి. ఇక తెలంగాణ జ‌న‌స‌మితి అభ్య‌ర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌కు 27,588 ఓట్లు పోల్ అయ్యాయి. ఏడు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. తీన్మార్‌ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో భారీగానే ఓట్లు దక్కాయి. కానీ ఇదే సమయంలో కనీసం 50 ఓట్లు పడని అభ్యర్థులు 29 మంది ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏడు రౌండ్లలో సాగిన లెక్కింపు ప్రక్రియలో కొన్ని రౌండ్లలో కనీసం ఒక్క ఓటును దక్కించుకోలేకపోయారు. ఓ ఇద్దరు అభ్యర్థులైతే.. ఏకంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇదిలావుంటే.. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 71 మంది బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

అటు హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వాణీదేవి, రామ‌చంద‌ర్ రావు మ‌ధ్య పోటీ ఉత్కంఠ‌ను త‌ల‌పిస్తోంది. ఒక్క రౌండ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య ఓట్ల తేడా వెయ్యి, రెండు వేల మ‌ధ్యే ఉండ‌టంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. తాజాగా ‘హైదరాబాద్‌’ స్థానంలో ఆరో రౌండ్ కూడా పూర్తికాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి.. త‌న సమీప ప్ర‌త్య‌ర్థి రాచంద‌ర్‌రావుపై 7,626 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు. ఇప్ప‌టివ‌రకు లెక్కించిన 6 రౌండ్లలో సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు రాగా..బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084 ఓట్లు పోలయ్యాయి. ఇక‌ స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 5,606 ఓట్లు వ‌చ్చాయి. ఫ‌లితాల స‌ర‌ళి చూస్తోంటే.. తొలి ప్రాధాన్య‌త ఓట్ల‌తో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అంచ‌నా వేస్తున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పద‌ని అధికారులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement