Monday, May 13, 2024

Telangana: రైతు సమస్యలు, అభివృద్ధిపై కేసీఆర్​ చర్చ.. 26 రాష్ట్రాల నుంచి 100 మంది ప్రతినిధులు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం ప్రగతి భవన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతు నాయకులతో ముచ్చటించారు. దేశంలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, రైతుల స్థితిగతులను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై చర్చించడానికి సదస్సు నిర్వహించారు. రైతులు, రైతు సంఘాల నేతలు రాగానే మధ్యాహ్న భోజనం అందించి, వ్యవసాయం, నీటిపారుదల, ఇతర రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాల గురించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం సీనియర్ రైతు నాయకులు కేసీఆర్ తెలంగాణ గురించే కాకుండా ఇతర రాష్ట్రాల రైతుల గురించి కూడా ఆలోచించాలని ఆకాంక్షించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

సభకు హాజరైన వారిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లయినా కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని పాలన సాగిస్తోందని, పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని దీనికి గల కారణాలను పరిశోధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. “మరీ ముఖ్యంగా దేశ పాలకులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ అంశంపై చర్చ అవసరం” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి దేశంలో మంచి జరగాలని భావించే శక్తులు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. “ఈ ప్రయాణం ప్రారంభంలో సందేహాలు ఉండవచ్చు. అయితే ఈ పోరాటంలో ఐక్యత నెలకొని విజయం సాధించడం చాలా ముఖ్యం’ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 100 మంది సీనియర్ రైతు నాయకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలపై మూడు రోజుల పరిశోధన యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలతోపాటు 26 రాష్ట్రాల రైతులు శుక్రవారం సిద్దిపేటకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగిన అధ్యయన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement