Saturday, April 27, 2024

తెలంగాణలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : సీఎం కేసీఆర్

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ..వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదన్నారు. తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాలవారికీ కూడా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు.

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. 2,3 రోజుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటానని సీఎం తెలిపారు. వైద్య పరీక్షల తర్వాత ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రెమిడెసివిర్, బెడ్స్, ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు అధైర్యపడొద్దని, నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం కేసీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement