Saturday, May 11, 2024

Big Story: ఆత్మగౌరవానికి ప్రతీక‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. పేద‌ల ముఖాల్లో ‘డబుల్‌’ సంతోషం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రతి మనిషికీ ప్రాథమిక అవసరాలు. ఇవి ఆత్మగౌరవానికి నిదర్శనాలు. పేదలకైతే ఇంకా ఎక్కువే. పేదలకు నివాసం అంటే చాలీచాలని ఇరుకుగది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం నిర్విరామంగా చేపడుతోంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు జూన్‌ 14, 2014 నుండి ఏప్రిల్‌ 30 2022 వరకు ప్రభుత్వం 2,91,057 గృహాలను మంజూరు చేసింది. ఇందులో 2,74,142 గృహాలకు జిల్లా కలెక్టర్లతో పరిపాలనా అనుమతులు జారీ చేయబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో టెండర్లు ఖరారు అయినవి 2,74,142కాగా, పూర్తయిన ఇళ్లు 1,13,013 ఇళ్లు. పూర్తి కావొస్తున్నవి 68,964, ఇంకా పురోగతిలో ఉన్న గృహాలు 47,598, ప్రారంభించని గృహాలు 61,482. ప్రాజెక్టు వ్యయం 19,126 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.10,798.79 కోట్లు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌1, 2021 నుండి 2022 మార్చి 31 వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ కార్యక్రమం కింద ప్రభుత్వం 5 వేల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో స్పిల్‌ఓవర్‌ ఇళ్లతో సహా పూర్తయిన ఇళ్లు 57,239. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.12వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో రూ.4,600 కోట్లను మిగిలిన ఇళ్ల నిర్మాణానికి పూర్తి చేయడానికి కేటాయించింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ హౌసింగ్‌ కాలనీలలో మౌలిక సదుపాయాలు లేని ఇండ్లను నివాసయోగ్యంగా మార్చడానికి, లబ్ధిదారులకు అందజేసేందుకు మంజూరైన ఇళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడానికి రూ.203.39 కోట్లు ప్రభుత్వం ఈ ఏడాది ఆమోదించింది. అదేవిధంగా బలహీన వర్గాల హౌసింగ్‌ ప్రోగ్రామ్‌ కింద 29,64,435 మంది లబ్ధిదారులకు రూ.3,920.56 కోట్లు జూన్‌ 2, 2014 వరకు పంపిణీ చేశారు. గజ్వేల్‌, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల లేఅవుట్‌లకు హడ్కో డిజైన్‌ అవార్డు 2017లో లభించింది. హౌసింగ్‌ సెక్టార్‌ 2018-19లో ఇ-గవర్నెన్స్‌లో అద్భుతమైన పనితీరుకు పీఎంఏవై-యు అవార్డు లభించింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఇలా…
ఉమ్మడి రాష్ట్రంలో 1982 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు బలహీనవర్గాల గృహ నిర్మాణాల పేరిట ఇండ్లు నిర్మించినా, అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదు. చాలా వరకు ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగిన ఆరోపణలు వచ్చాయి. కొద్దో గొప్పో ఇండ్ల నిర్మాణం జరిగినా అవి ఒక్కగది(260 చదరపు అడుగుల) ఇల్లు మాత్రమే కావడంతో కుటుంబ అవసరాలు దాంతో తీరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.19,126 కోట్లను ఖర్చు చేస్తున్నది. అప్పటి ప్రభుత్వాలు ఈ గృహాలకు కేవలం 30 శాతం భారం భరించి, లబ్ధిదారుడి మీద 70 శాతం భారం మోపేది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారునిపై రూపాయి కూడా భారం మోపకుండా పూర్తిగా ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మిస్తున్నది. ఇళ్ల నిర్మాణికి రూ.230లకే బస్తా సిమెంట్‌ను అందించడానికి సిమెంట్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో అప్పట్లో మూడేళ్లు(అక్టోబర్‌ 2019 వరకు) ఒప్పందం చేసుకుంది.

డబుల్‌ ఇండ్ల స్వరూపం…
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యంగా వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ప్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్త ఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతి ఇంటి ముందూ నల్లా కనెక్షన్‌, మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతి ఇంటికి వేర్వేరుగా మెట్లు, వాటర్‌ ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో ఇంటికి అయ్యే ఖర్చు….
ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూరల్‌ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేస్తోంది. వీటిలో రూ.5.04 లక్షలు ఇంటి నిర్మాణానికికాగా, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెడుతున్నది. అర్బన్‌ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.7 లక్షలు (జీప్లస్‌ 3), రూ.7.9 లక్షలు(సీ ప్లస్‌ ఎస్‌ ప్లస్‌ 9) ఖర్చు చేస్తున్నది. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా చెట్లు, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతున్నారు.

- Advertisement -

రాజీవ్‌ స్వగృహాలకు వేలం…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వదిలేసి వెళ్లిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం ఓ కొలిక్కి తెచ్చింది. రాజీవ్‌ స్వగృహ కింద 36 ప్రాజెక్టులు చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఆ భూములను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి రూ.1000 కోట్ల అప్పు తీసుకుంది. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వంపై భారం మోపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పులతో పాటు రూ.1200 కోట్ల వడ్డిని సైతం బ్యాంకులకు చెల్లించి తనఖాలో ఉన్న 784 ఎకరాల భూములను విడిపించింది. అంతేకాకుండా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌స్వగృహలోని 3వేలకు పైగా ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement