Tuesday, May 7, 2024

Special Story – మాన‌వాభివృద్ధిలో మ‌నం ఇంతేనా..

(న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

భారత్‌ అభివృద్దిలో దూసుకుపోతోంది. అగ్రరాజ్యాలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. శాస్త్రసాంకేతిక, వైద్యవిజ్ఞాన రంగాల్లో అగ్రగామిగా రూపుదిద్దుకుంటోంది. భారతీయ యువ మేథావులు ప్రపంచ అత్యున్నత సంస్థల కార్య నిర్వహణాధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు దేశాల్లో భారతీయ సంతతి పాలకులుగా మారారు. 86కిపైగా దేశాల్లో ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్ని ప్రభావితం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది. ఇంత వేగంగా స్థూల జాతీయోత్పత్తిలో వృద్ది నమోదు చేస్తున్న దేశం మరేదీలేదు.
ఇదంతా నాణానికి ఓ వైపు. కానీ నాణానికి మరో వైపు ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్‌ విలువకనుగుణం గా అంతర్జాతీయ సంస్థలు ఆయా దేశాల జిడిపిని లెక్కలు గడతాయి. అలాగే అక్కడి పౌరుల కొనుగోలు శక్తి ఆధారంగా పిపిపిని అంచనాలేస్తాయి.వీటిని బట్టి చూస్తే భారత్‌ వేగంగా దూసుకుపోతోంది. అయితే క్షేత్రస్థాయిలో మానవ అభివృద్ది సూచిక అత్యంత ముఖ్యమైంది. ఇది ఆయా దేశాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్న పలు ప్రధాన అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ముఖ్యంగా పోషకాహారం, శిశుమరణాలు, పాఠ శాలలకు హాజరౌతున్న పిల్లల శాతం, వంటగ్యాస్‌, పారిశుధ్యం, త్రాగునీరు, మెరుగైన వైద్యం, విద్యుత్‌ అందుబాటు, ఇంటి వసతి, వ్యక్తిగత ఆస్తుల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ క్రమంలో తాజాగా వెలువడ్డ మానవ అభివ ృద్ది సూచికను 191దేశాలకు సంబంధించి రూపొందిస్తే ఇందులో భారత్‌ 132వ స్థానంలో ఉంది. ఇంతటి అతితక్కువ స్థాయిలో ఇక్కడి జనాభాకు కనీస పౌరసదుపాయాలు, ముఖ్యంగా విద్య, వైద్యం, త్రాగునీరు, ఆరోగ్యం అందుబాటులో ఉన్నాయి.

అలాగే పిల్లలకు ఇక్కడ లభిస్తున్న పోషకాహారానికి కూడా ఈ రేటింగ్‌ అద్దంపడుతోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌ 0.962పాయింట్లతో ప్రపంచ దేశాల్లో మానవ అభివృద్ది సూచికలో అగ్రస్థానంలోంది. 0.961పాయింట్లతో నార్వే రెండో స్థానంలో 0.959పాయింట్లతో ఐస్లాండ్‌ మూడో స్థానంలో 0.952పాయింట్లతో హాంకాంగ్‌ నాలుగు, 0.951పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో నిల్చాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు 18వ స్థానం, యునైటెడ్‌ స్టేట్స్‌కు 21వ స్థానం దక్కితే చైనా 79వస్థానంలో నిల్చింది. ఇందులో భారత్‌ 0.633పాయింట్లను మాత్రమే దక్కించుకుని 132వ స్థానానికి పరిమితమైంది.

ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక 2023ప్రకారం భారత్‌లో గడిచిన 15ఏళ్ళలో 41.50కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందారు. ఈ సూచికను ఐక్యరాజ్య సమితి అభివృద్ది కార్యక్రమం, ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్ర, మానవ అభివృద్ది సంస్థలు ఉమ్మడిగా రూపొందించాయి. వివిధ అంశాల ప్రాతిపదికన ఆయా దేశాలిచ్చిన లెక్కల ఆధారంగానే అక్కడి ప్రజల జీవన నాణ్యతను ఇవి లెక్కిస్తున్నాయి. దారిద్య్రం అసమాతనల వేదిక అయిన ప్రాపర్టీ అండ్‌ ఇన్‌ ఈక్వాలిటీ ఫ్లాట్‌ఫారం విశ్లేషణ ప్రకారం భారత్‌లో రోజూ 2.25డాలర్ల లోపు ఆదాయం కలిగిన వారు మొత్తం జనాభాలో 11.88శాతంగా ఉన్నారు. అయితే ఇవి అంతర్జాతీయ కొనుగోలు శక్తి, మార్కెట్‌ ధరల ప్రభావానికనుగుణంగా వేసిన అంచనాలే. ఇవి కూడా భారత్‌ విషయానికొస్తే వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. 2019లో ప్రపంచ బ్యాంక్‌ రోజూ 1.90డాలర్ల లోపు ఆదాయం కలిగిన వ్యక్తుల్ని దారిద్య్రరేఖకు దిగువనున్న వారిగా నిర్ధారించింది. 2022లో దీన్ని 2.15డాలర్లకు పెంచింది.

తాజాగా 2.25డాలర్లను ఇందుకు ప్రామాణికంగా పేర్కొంది. ప్రస్తుతం డాలర్ల విలువ సుమారు 82రూపాయలుంది. అలా చూస్తే ప్రస్తుతం రోజూ రూ. 176.30లు ఆదాయం కలిగిన వ్యక్తి దారిద్య్రరేఖను జ యించినట్లే. అంటే నెలకు 5,289రూపాయల ఆదాయం కలిగిన వ్యక్తి దారిద్య్రరేఖకు ఎగువనున్నట్లు భారత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వాలిచ్చే గణాంకాల ఆధారంగానే అంతర్జాతీయ సంస్థలు ఈ నివేదికల్ని రూపొందిస్తున్నాయి. 2019లో భారత్‌లో మానవ అభివృద్ది సూచిలో 0.645పాయింట్లు పొందింది. రెండేళ్ళు తిరిగేసరికి ఈ పాయింట్లు 0.633కి పడిపోయాయి. అలాగే భారతీయుల సగటు ఆయుర్ధాయం 69.7నుంచి 67.2సంవత్సరాలకు దిగజారింది. గత 15ఏళ్ళలో పాఠశాల విద్య సగటు వయసు 11 సంవత్సరాలు కాగా ఇప్పుడది 6.7కు తగ్గిపోయింది. వరుస సంక్షోభాల నేపధ్యం కూడా మానవాభివృద్ది సూచికపై ప్రభావం చూపించింది.

దేశంలో జీవన వ్యయం పెరిగింది. ఇంధన సంక్షోభం నెలకొంది. ఇవి కూడా ప్రజల జీవితాల ని ప్రభావితం చేశాయి. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవ అభివృద్ది సూచికను పరిశీలిస్తే భారత్‌ ఈ విషయంలో తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. సరిహద్దు దేశాలు భూటాన్‌, బంగ్లాదేశ్‌లు కూడా ఈ విషయంలో గతం కంటే మెరుగైన ఫలితాల్ని సాధించాయి. కాగా ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యాలపై ప్రభుత్వాలు చేసేవ్యయం కూడా మానవ అభివృద్ది సూచికలో పాయింట్లలో ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి, దుఖ్ఖం, కోపం, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో మానసిక ఆరోగ్యంపై కనీసం 2శాతం కేటాయించాల్సిన ఆవశ్యకతను గతంలోనే ప్రపంచ ఆరోగ్య సం స్థ వెల్లడించింది.

- Advertisement -

వీటన్నింటిని సమీక్షించి సవరించుకోని పక్షంలో భారత్‌ గొప్ప ఆర్ధిక, సైనిక, సాంకేతిక శక్తిగా అవతరించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. వారి ఆరోగ్యాలు కుదుటపడవు. వారిజీవన కాలపరిమితి పెంచడం సాధ్యం కాదు. మౌలిక సదుపాయాల్తో పాటు విద్య, వైద్యం, పోషకాహారాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

మానవ అభివృద్ది సూచిక అంటే
మానవ అభివృద్ది సూచిక వివిధ దేశాల సామాజిక, ఆర్ధిక అభివృద్ది స్థాయిని ప్రతిబింభిస్తోంది. 1990 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ గణాంకాల్ని క్రోడీకరించి విడుదల చేస్తోంది. ఈ సూచిక కాలక్రమేణా అభివృద్ది స్థాయిల్లో మార్పుల్ని గుర్తించడానికి ఉపయోగపడుతోంది. ఆయా దేశాల ప్రజల వ్యక్తిగత సామర్ద్యాలు, ప్రమాణాలను ఇది లెక్కిస్తోంది. ఇందులో సగటు వార్షిక ఆదాయంతో పాటు విద్య, వైద్య సదుపాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రముఖ ఆర్ధిక వేత్తల్తో జీవన నాణ్యతపై విశ్లేషిస్తోంది. కేవలం స్థూల దేశీయోత్పత్తి, ఆర్ధికవృద్దిల గణాంకాలకే పరిమితం కాకుండా ఆయా దేశాల్లోని వ్యక్తిగత మానవ అభివృద్దే ఆ దేశాల సామర్ధ్యాన్ని ప్రతిబింభి స్తుంది. ఓ దేశం ఎంతగొప్ప సంపద కలిగినా ఆ సంపదలో 90శాతం ఆ దేశంలోని ఒక్క శాతం ప్రజల వద్ద కేంద్రీకృతమైతే అక్కడి మెజార్టీ ప్రజల జీవన దుర్భర పరిస్థితులు దీర్ఘకాలంలో అంతర్గత కలహాలు, అంతర్యుద్దానికి దారితీస్తాయి. తలసరి ఆదాయాలు సమానంగానే ఉన్న పలు దేశాల్లో వ్యక్తిగత ఆదాయాల మధ్య తీవ్ర వ్యత్యాసం వ్యక్తమైతే అది ప్రజాజీవన ఉత్తేజాన్ని తిరోగమనంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికే మానవ అభివృద్ది సూచికను ఏటేటా విడుదల చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement