Friday, May 3, 2024

అనారోగ్యంతో క‌న్నుమూసిన – సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గుడిపూడి శ్రీహ‌రి

అనారోగ్యంతో బాధ ప‌డుతూ క‌న్నుమూశారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడిపూడి శ్రీహ‌రి.ఆయ‌న వ‌య‌సు 86ఏళ్లు. గత వారం ఇంట్లో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఇతర అనారోగ్య సమస్యలతో రాత్రి 2 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణించిన తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. విదేశాల్లో ఉన్న కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. గుడిపూడి శ్రీహరి దాదాపు అర్ధ శతాబ్దం పాటు పాత్రికేయుడిగా, సినీ విశ్లేషకుడిగా సేవలను అందించారు. ఈనాడు, హిందూ, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రముఖ పత్రికల్లో పని చేశారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని రచించారు.

1969 నుంచి హిందూ పత్రికకు రివ్యూలు రాయడం ప్రారంభించారు. ఇరవై ఏళ్ల పాటు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్ గా ఆయన సేవలందించారు. ఈనాడు దినపత్రికలో ‘హరివిల్లు’ శీర్షికతో 25 ఏళ్లపాటు సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలతో కూడిన రచనలు సాగించారు. అలాగే ప్రముఖ సినీ వారపత్రిక ‘సితార’లో ఆయన దశాబ్దాల పాటు సినిమా రివ్యూలు చేశారు. నిష్పక్షపాతంగా.. సరికొత్త తరహాలో.. విశ్లేషణాత్మకంగా ఆయన రాసే రివ్యూలకు ఎంతో పేరు వచ్చింది. ఆయన రివ్యూలు చూసి, ఒక సినిమాకు వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకునే ప్రేక్షకులు కూడా వుండేవారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఆయన రివ్యూల కోసం ఆయా సినిమాల దర్శక నిర్మాతలే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూసేవారు. అంతగా ఆ రివ్యూలకు ఒక ముద్ర ఉండేది. శ్రీహరికి తెలుగు విశ్వవిద్యాలయం 2013లో ‘కీర్తి పురస్కారం’ను ప్రకటించింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement