Friday, April 26, 2024

Big Story | చేతులెత్తేసిండ్రు.. అటు పార్టీ పెద్దలు, ఇటు అధికారులు పట్టించుకుంటలే!

అక్రమ నిర్మాణాలతో బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిష్ట మసకబారుతున్నప్పటికీ.. పట్టించుకోవాల్సిన అధికార పార్టీ పెద్దలు.. అక్రమ నిర్మాణాలను నిలువరించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శల పాలవుతోంది… క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించి.. గాడిన పెట్టాల్సిన ఉన్నతాధికారులు సైతం మిన్నకుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… అధికారులు పట్టించుకోకపోవడం.. అధికార పార్టీ పెద్దలను ప్రస్తుత పాలకవర్గం పరిగణలోకి తీసుకోక పోవడం తో.. అక్రమాలకు అడ్డుకట్ట పడటంలేదని తెలుస్తోంది… అధికార పార్టీకి.. విపక్షాలకు మధ్య సయోధ్య బాగానే కుదరటంతో అవినీతి.. అక్రమాలు.. ఆమ్యామ్యాలు అవిభక్త కవలలుగా బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో రాజ్యమేలుతున్నాయి…
‌‌- ఆంధ్రప్రభ నిఘా విభాగం, గ్రేటర్‌ హైదరాబాద్‌

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో అక్రమాల్లో అగ్రతాంబూలం అందుకుంటోంది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం బహిరంగంగానే సహకారం అందిస్తున్న కారణంగా ఇక్కడ అక్రమాలకు అంతే లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక కార్పొరేటర్లు బరితెగించి మరీ అక్రమాలకు తెగబడుతుండటంతో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. పాలకవర్గంలోని కొందరు పెద్దల అండదండలతో అక్రమ నిర్మాణదారులు చెలరేగిపోతున్నారు. దీంతో అడుగడుగునా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి.

ఆమ్యామ్యాలతో మౌనం
మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, కార్పొరేటర్లు, పాలకవర్గంలోని కొందరికి అక్రమార్కుల నుంచి నెల వారీగా నజరానాలు ముడుతున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అక్రమ నిర్మాణ దారుల నుంచి అంతస్తుకో రేట్‌ చొప్పున వసూళ్లకు పాల్పడటంతో పాటు, అనుమతులకు మించి చేపట్టే నిర్మాణాల ద్వారా అదనపు ఆదాయాన్ని వక్రమార్గంలో పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సెల్లార్లు, అనుమతి లేని నిర్మాణాలకు అడ్డాగా మారిన బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు అవిభక్త కవలలుగా రాజ్యమేలుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సైతం మిన్నకుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, కార్పొరేషన్‌ పరిధిలో సాగుతున్న అనైతిక అక్రమ దందాలకు మేడ్చల్‌ నియోజకవర్గ అధికార పార్టీ పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరికైనా చెప్పుకోండి.. ఆగేదే లే అన్నట్లుగా ఇక్కడ పాలకవర్గంలోని పెద్దలు, అవినీతికి అలవాటు పడ్డ కార్పొరేటర్లు బహిరంగంగానే పేర్కొంటున్నారంటే వారి వసూళ్ల దందా ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

కార్పొరేటర్ల అక్రమ దందా..
బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణ దారులకు తీసిపోని విధంగా కార్పొరేటర్లు సైతం దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు కార్పొరేటర్లు, అధికార పార్టీ పెద్దలను లెక్క కూడా చేయకుం డా వసూళ్ల దందాలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుండగా, అధికారులను ధిక్కరించి మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెంగిచర్ల ప్రధాన రహదారి మొదలు, రామకృష్ణానగర్‌ కాలనీలో సాగుతున్న అక్రమ నిర్మాణాల వెనుక కార్పొరేటర్ల హస్తమున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కార్పొరేషన్‌ పరిధిలోని రాధిక నగర్‌ కాలని, క్రాంతి నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల పేరిట సాగించిన అక్రమ వసూళ్లలోనూ కార్పొరేటర్లకు వాటాలు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ పెద్దల మౌనం – ప్రజల పాలిట శాపం..
అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దల మౌనం కూడా బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజల పాలిట శాపంగా పరిణ మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అధికారులు మిన్నకుంటున్నట్లు తెలుస్తుండగా, తన రోజువారి షెడ్యుళ్లతో మంత్రి బిజీ గా ఉండటం అక్రమార్కులకు కలిసొచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో సాగుతున్న అక్రమాలను అంతగా పట్టించుకోక పోవడంతో, పార్టీకి – పాలకవర్గానికి మధ్య స్తబ్దత నెలకొంది. దీంతో బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సాగుతున్న అక్రమాలపై ఎవరూ దృష్టి సారించలేదని ప్రచారం జరుగుతోంది. పార్టీ పెద్దలుగా ఉన్న వారి మౌనం, పాలకవర్గంలోని కొందరి ధన దాహం కారణంగా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో కార్పొరేటర్లు, పాలకవర్గంలోని కొందరు అక్రమార్కులు, అక్రమ నిర్మాణదారులతో బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అక్రమాలదే పైచేయి అవుతోందన్న ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, పార్టీ పెద్దల గాడిన పెట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement