Friday, May 3, 2024

సిసోడియాకు మళ్లీ చుక్కెదురు.. లిక్కర్ స్కాం ఈడీ కేసులో బెయిల్ తిరస్కరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు న్యాయస్థానంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయగా.. అప్పటి నుంచి జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో మనీలాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా సిసోడియాను ఆ తర్వాత అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ కేసులో, ఈడీ కేసులో బెయిల్ కోసం స్పెషల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటికే బెయిల్ నిరాకరిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇదే కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. సిసోడియాకు మాత్రం నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో సీబీఐ కేసులో సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో పెండింగులో ఉంది.

ఇదిలా ఉండగా ఈడీ కేసులోనూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. గత విచారణలోనే వాదనలు ముగించిన స్పెషల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించిన స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

మూడో అదనపు చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో మనీ లాండరింగ్ అంశంపై ఈడీ మూడో అదనపు చార్జిషీటును గురువారం సాయంత్రం దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన చార్జిషీటుకు అనుబంధంగా రెండు సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేసిన ఈడీ, మూడో అదనపు చార్జిషీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సన్నిహితుడైన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, ఉత్తరాది మద్యం వ్యాపారి అమన్‌దీప్ ధల్‌పై అభియోగాలు మోపింది. ఈ చార్జిషీటుపై శుక్రవారం ఈడీ తరఫు న్యాయవాదులు చార్జిషీటు వివరాలను న్యాయమూర్తికి తెలియపరిచారు. చార్జిషీటును పరిగణలోకి తీసుకునే అంశంపై తదుపరి విచారణ జరపనున్నట్టు స్పెషల్ కోర్టు వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement