Sunday, May 12, 2024

ఎన్నికల వ్యూహకర్త – ఇకపై కాంగ్రెస్ కార్యకర్త.. కాంగ్రెస్‌లో చేరనున్న ప్రశాంత్ కిశోర్!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇక నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా మారనున్నారు. అటు కాంగ్రెస్ వర్గాలు, ఇటు ప్రశాంత్ కిశోర్ కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేస్తున్నాయి. దేశంలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్న ప్రశాంత్ కిశోర్ శనివారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, అజయ్ మాకెన్ కూడా పాల్గొన్నారు. గత ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే పలు కారణాలతో ఆ చర్చలు ముందుకు సాగలేదు. ఇదిలా ఉంటే, గతంలో పీకే టీమ్‌లో పనిచేసిన సునీల్ వంటివారిని కాంగ్రెస్ తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వ లోపాలపై పీకే కూడా పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే గతం గతః అనుకుంటూ తాజాగా జరిగిన భేటీలో కాంగ్రెస్‌లో చేరడం సహా అనేక కీలకాంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలిసింది.

2024 ఎన్నికలకు బ్లూ ప్రింట్

ఎన్నికల వ్యూహాలతో పార్టీలకు విజయాలు అందించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాధ్యతను చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై పీకే ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. 370 నుంచి 400 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని లోతైన అధ్యయనం జరిపి సిద్ధం చేసిన రిపోర్టులను చూపించారు. లోపాలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలను కూడా పీకే సూచించారు. పీకే నివేదికలు, సూచనలపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం, పీకేను ఒక కన్సల్టంట్‌గా కాకుండా పార్టీలో చేరి బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ ఆఫర్‌పై పీకే కూడా సానుకూలంగానే ఉన్నారని తెలిసింది. చేరిక సందర్భంగా పదవులేవీ ఆశించడం లేదని, సూచనలను తూచా తప్పకుండా అమలు చేస్తే చాలని పీకే చెప్పినట్టు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పీకే బ్లూ ప్రింట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, రోడ్‌మ్యాప్ అమలు చేయడం కోసం ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. సోనియా బృందంతో పీకే సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయం వెల్లడించారు.

2024తో సార్వత్రిక ఎన్నికలతో పాటు కాంగ్రెస్ ఎదుర్కోబోయే ప్రతి ఎన్నికకూ పీకే వ్యూహాలను అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి చోట్ల మాత్రం భావసారూప్యత కల్గిన పార్టీలతో కలిసి కూటములను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ పూర్తి బలహీనంగా ఉన్నచోట పొత్తులు, కూటములతో ముందుకెళ్లాలని, విజయం సాధించే అవకాశం ఉన్నచోట మాత్రం ఒంటరిగానే బలాన్ని పంజుకుని పోటీ చేయాలని పీకే చెబుతున్నారు.

చీకట్లో చిరుదీపం

- Advertisement -

వరుస పరాజయాలతో కార్యకర్తల నుంచి నాయకత్వం వరకు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయి చీకట్లు కమ్ముకున్న కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చిరుదివ్వెలా కనిపిస్తున్నారు. అందుకే ఎన్నికల వ్యూహాలు అందించే ఓ రాజకీయ వ్యాపారిని ఏకంగా పార్టీలోనే చేర్చుకునేందుకు ఆ పార్టీ ఆహ్వానం పలికింది. ఈ మధ్యనే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌లో ఉన్న అధికారాన్ని కోల్పోవడంతో పాటు మిగతా చోట్ల కూడా పేలవమైన ప్రదర్శన కనబర్చింది. ఇప్పటికే ఐసీయూలో ఉన్న పార్టీ, ఇప్పుడు వెంటిలేటర్ మీదకు చేరిందని పార్టీలోనే పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే కాంగ్రెస్‌ను బ్రతికించాల్సిన అవసరముందని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మొత్తంగా వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ప్రశాంత్ కిశోర్ ప్రాణవాయువు (ఆక్సిజన్)లా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొందిన సీనియర్ నేతలే తమ స్వార్థం కోసం పార్టీని వీడుతున్న తరుణంలో, కాంగ్రెస్‌ను బ్రతికించేందుకు వ్యూహాలతో ముందుకొచ్చిన ప్రశాంత్ కిశోర్ వారికి ఒక ఆశాకిరణంలా మారారు. పార్టీలో సమూల ప్రక్షాళన అవసరమంటూ కాంగ్రెస్‌లోనే జీ-23 నేతలు వినిపిస్తున్న అసమ్మతి గళాల నడుమ, ప్రశాంత్ కిశోర్ ఎలాంటి బాధ్యతలు చేపడతారో, ఏమేమి మార్పులు తీసుకొస్తారోనన్న ఆసక్తి ఇప్పుడు ఆ పార్టీతో పాటు దేశంలోని రాజకీయ వర్గాల్లో నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement