Monday, April 29, 2024

ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నా… వెంటాడుతున్న పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు : కార్డియాలజీ వైద్య నిపుణులు..

కరోనా ఒమిక్రాన్‌ సోకినా తీవ్ర అనారోగ్యం బారిన పడలేదని, ఆసుపత్రికి వెళ్లకుండానే వైరస్‌ నుంచి బయటపడ్డామన్న సంతోషం బాధితుల్లో ఎక్కువ రోజులు మిగలడం లేదు. ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది పోస్టు కొవిడ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది గుండెలో నొప్పి, మంట, నీరసం, కండరాల నొప్పి, గ్యాస్‌ ట్రబుల్‌, చిరాకు, అలసట , ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న వారిలో ఇప్పుడు గుండె సంబంధిత రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తుండడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలా మందిలో గుండె కండరాల అనారోగ్యం తలెత్తుతున్నట్లు నిపుణులు గుర్తించారు. చాలా మంది కొవిడ్‌ బాధితులు గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రికి రావడం రెండు, మూడు వారాల్లో పెరిగి పోయిందని అపోలో, కామినేని, కిమ్స్‌ ఆసుపత్రుల్లోని కార్డియాలజీ విభాగాలు చెబుతున్నాయి.

కరోనా మొదటి, సెకండ్‌ వేవ్‌లలో వైరస్‌ నుంచి కోలుకున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల్లో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతోనే కన్ను మూసినట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలా మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో గుండెలో రక్తం గడ్డ కట్టుకుపోవడం, గుండె దడ, శ్వాస తీసుకోలేకపోవడం తదితర సమస్యలను గుర్తించారు. ఈ సమస్యల కారణంగా చాలా మంది బాధితుల్లో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు సంభవిస్తోంది. గుండె రక్త నాళాలు చిట్లి పోవడం కూడా కొందరిలో గుర్తించామని ఢిల్లి ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం చెబుతోంది. మొత్తంగా ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చెస్ట్‌ పెయిన్‌, నీరసం వంటి అనారోగ్య లక్షణాలు కామన్‌గా కనిపిస్తున్నాయి. మరికొంత మందిలో బీపీ లెవల్‌ పడిపోవడం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలు, షుగర్‌ స్థాయిలు పెరగిపోతున్నట్లు గుర్తించినట్లు ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి కార్డియాలజీస్టు డా.సాగర్‌ తెలిపారు. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో బీపీ, షుగర్‌ పెరిగిపోవడం కారణంగా గుండె పనితీరు తీవ్రంగా మందగిస్తూ హార్ట్‌ ఎటాక్‌ ముప్పును దగ్గర చేస్తోంది..

ఈ పరిస్థితుల్లో కరోనా నుంచి కోలుకున్న 60-90 రోజుల తర్వాతే సాధారణ జీవితంలో మాదిరిగా పనులను మొదలుపెట్టాలని, మరీ ముఖ్యంగా రోజువారీ వ్యాయామం నెల తర్వాతే ప్రారంభించాలని, ఎక్కువ స్ట్రెయిన్‌ అయ్యే వ్యాయామాలు చేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న వారు పండ్లు, కూరగాయలు, అన్నిరకాల ధాన్యాలను ఆహారం తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్న రెండు, మూడు నెలల తర్వాతే కఠినమైన వ్యాయామాలు చేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement