Tuesday, March 26, 2024

రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదు

సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాటిని టిఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

జనగమకు సీఎం కెసిఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళని నిలదీయాలన్నారు. రైతుకు ఇంతగా చేసిన ప్రభుత్వం దేశంలో ఉందా? అని ప్రశ్నించారు. రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి, తోక ముడిచినది ఎవరు? అని అడిగారు. కరెంట్ ను కూడా ప్రైవేట్ పరం చెయ్యాలని చూసింది ఎవరు? అని మండిపడ్డారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సీఎం కెసిఆర్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఇవన్నీ వివరించడానికే సీఎం కెసిఆర్ జనగామ సభ పెడుతున్నారని పేర్కొన్నారు. సీఎం సభను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జనం, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు. అత్యధిక పార్టీ సభ్యత్వం ఉన్న మన ఇంటి పార్టీ టిఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలన్నారు. జనగామ సభ ప్రతిపక్షాలకు సవాల్ గా నిలవాలన్నారు.

తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రతి గ్రామానికి కోట్ల కొద్ది నిధులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు. గతంలో మంచినీటికి కూడా గతి లేదని, ఇప్పుడు గ్రామాలకు అన్ని మౌలిక వసతులు కలిగాయన్నారు. రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. వచ్చే మార్చి నుంచి స్థలాలు ఉన్న అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇస్తామన్నారు. వచ్చే మూడేండ్లలో దళితులు అందరికీ దళిత బంధు అందుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement