Thursday, April 25, 2024

గంగానదిలో 2 వేల మృతదేహాలు

గత కొద్ది రోజులుగా బీహార్, యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బీహార్‌, ఉత్తర్ ప్రదేశ్‌లలో గంగానదిలో ఒడ్డున దాదాపు 2 వేల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గంగానది ఒడ్డున వందలాది మృతదేహాలు బయటపడ్డాయి. నది ఒడ్డున ఇసుకలో అనేక మృతదేహాలను పాతిపెట్టారు. కొన్ని శవాలు బయటకి వచ్చేశాయి.  మరణించిన కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా, ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని గంగానది పరివాహక జిల్లాల అధికారులు చెబుతున్నారు. గంగానదిలో కొవిడ్ మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నదిలో మృతదేహాలు కనిపించడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో దాదాపు 1400 కి.మీ గంగానది ప్రవహిస్తుంది. నదిలో కోవిడ్ మృతదేహాలను పడేయడం వల్ల ఇరు రాష్ట్రాల్లో కేసులు తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. కాన్పూర్, ఘాజిపూర్, ఉన్నవో, బాలియా నాలుగు జిల్లాల్లో మృతదేహాలు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయని కేంద్రం తెలిపింది.

కోవిడ్ -19 రోగుల మృతదేహాలు బీహార్, ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోని గంగా నదిలో తేలిన ఘటన వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే, బయటపడిన మృతదేహాలు కోవిడ్ 19 రోగులవా? కాదా? అని అధికారులు నిర్ధారించలేదు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. నదికి దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందిందని, దీనిపై పరిశోధన జరుగుతోందన్నారు. విచారణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొంతమంది మృతదేహాలను తగలబెట్టగా.. మరికొందరు వాటిని నది ఇసుకలో పాతిపెట్టారని తెలిపారు. ఈ శవాల వల్ల నీరు కలుషితం అయ్యిందని, కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement