Friday, June 2, 2023

ఒడవని ముచ్చట: రేవంత్‌ తీరుపై కాంగ్రెస్‌ సీనియర్ల గుస్స.. అశోక హోటల్‌లో భేటీకి సన్నద్ధం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై రగిలిపోతున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు ఆయనపై ఫిర్యాదు చేసేందుకు హస్తిన బాట పట్టాలని నిర్ణయించారు. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు రేవంత్‌పై ఉన్నాయి. వారం రోజుల క్రితం పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సమావేశమైన పార్టీ ముఖ్య నేతలు ఆదివారం ఉదయం మరోసారి భేటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించకుండానే రేవంత్‌ తానంతట తాను నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పాతతరం కాంగ్రెస్‌ నాయకులను పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహిస్తుండడం.. ఈ బహిరంగ సభకు పార్టీ సీనియర్లను ఆహ్వానించకపోవడంపై వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

రేవంత్‌ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించిన సీనియర్లు ఈనెల 22న ఢిల్లి వెళ్లి పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌లను కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోరామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ‘ఆంధ్రప్రభ’కు చెప్పారు. సీనియర్లను బేఖాతరు చేస్తూ రేవంత్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో జరిగే కార్యక్రమాలను చెప్పకుండా తానంతట తాను నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే అందరు ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో పని చేయాలే తప్ప ఒకరితో పార్టీ బలపడదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 22న ఢిల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఈబీసీ సమావేశం జరుగుతోందని తాను ఈ భేటీకి వెళుతున్నానని ఈ సందర్భంగా పార్టీ పెద్దలను కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వ్యవహారశైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వివరిస్తానని చెప్పారు.

- Advertisement -
   

పార్టీలో తన సొంత ఎజెండాను అమలు చేసే దిశగా రేవంత్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని దీంతో పార్టీలో ఉన్న సీనియర్లు, ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కలిసి కట్టుగా పోరాడితే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని హనుమంతరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలే తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అది పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని అభిప్రాయ పడ్డారు.

కోమటిరెడ్డితో వీహెచ్‌ భేటీ
మాజీ పీసీసీ చీఫ్‌ వి.హనుమంతరావు శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు గౌరవం లేదని ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన ఇటీవల తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై మీడియాతో మాట్లాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తెరాసను గద్దె దించడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొని ముందుకు సాగుతానని ఇందుకు ఏ పార్టీ ధీటుగా పోరాడుతుందో ఆ పార్టీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నివాసానికి వెళ్లిన వీహెచ్‌ పార్టీ వీడొద్దని హితవు పలికారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉందని ఈ కష్ట సమయంలో అందరం కలిసి కట్టుగా పని చేసి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దామని వీహెచ్‌ చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానాన్ని కోమటిరెడ్డి ఏకరువు పెట్టినట్టు సమాచారం. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఇతర నాయకులకు జరిగిన అవమానాలపై కూడా ఈ ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. పార్టీని వీడనని వీహెచ్‌కు హామీ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డి ఢిల్లికి వెళ్లి పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement