Wednesday, May 15, 2024

Exclusive | వీడని ముసురు.. ఆగి ఆగి దంచికొడుతున్న వాన!

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న (మంగళవారం) ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వానలు పడుతుండగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో అయితే ముసురుపట్టింది. ధారగా వర్షం పడుతూనే ఉంది. ఇక.. ఇవ్వాల (బుధవారం) కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ.. హైదరాబాద్​ వాతావరణ కేంద్రం రెడ్​ అలర్ట్​ని జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. కాగా, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రేపు (గురువారం) కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు అతి భారీ వర్షసూచన వాతావరణశాఖ అధికారులు జారీ చేశారు. రేపు (గురువారం) హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు.

- Advertisement -

కాగా, భారీ వర్షాల కారణంగా భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లావ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో బొగత జలపాతం వద్దకు పర్యాటకుల సందర్శనను ఫారెస్ట్‌ అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

మిడ్‌మానేరు డ్యామ్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఆర్కేపీ,.. కైరిగూడ ఓసీపీలో 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2లక్షల 44వేల టన్నుల ఓబీ పనులను సింగరేణి అధికారులు నిలిపివేశారు.

అతి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశముందని చెప్పారు. నిన్న (మంగళవారం) ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌లో 92.5 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 92.2 మిల్లీమీటర్లు, ఏటూరునాగారంలో 89.4 మిల్లీమీటర్లు, గోవిందరావుపేటలో 87 మిల్లీమీటర్లు, వెంకటాపురంలో 85.2 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

నైరుతి రుతుపవనాలు విస్తరించినా.. మొన్నటిదాకా వర్షాలు లేవు. కరువు పరిస్థితుల మాదిరిగా తయారైంది. దీంతో లోటు వర్షపాతం నమోదైంది. ఈ తరుణంలో వరుణుడు కరుణించాడు. ఈ నెలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడ్డాయి. ఇవ్వాల (బుధవారం) కూడా కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

బోగత జలపాతాల సందర్శన బంద్​..

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలపాతానికి వరద తాకిడి పెరిగి జలకళ సంతరించుకున్నది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలసంద్రంలా మారి కనువిందు చేస్తుండటంలో పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే.. భారీ వర్షాలు, వరద ఉధృతి నేపథ్యంలో జలపాతం సందర్శనను నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఇవ్వాల్టి (బుధవారం) నుంచి బొగత సందర్శనకు అనుమతి లేదని ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement