Sunday, May 19, 2024

Kannada | సీనియర్​ సిటిజన్లకు గుడ్​ న్యూస్.. ఇకపై క్యూలో ఉండాల్సిన అవసరం లేదు!

కర్నాటకలోని కాంగ్రెస్​ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.  65 ఏండ్లు పై బడిన సీనియర్​ సిటిజన్లు రాష్ట్రంలోని ఏ ఆలయానికి వెళ్లినా క్యూలో ఉండాల్సిన అవసరం లేదని, నేరుగా దైవ దర్శనానికి వెళ్లొచ్చని ప్రభుత్వం సర్క్యులర్​ జారీచేసింది. దీనికి ఆధార్​ కార్డు, ఏ ఇతర గుర్తింపు కార్డు అయినా చూపి దర్జాగా దేవుడి దర్శనం చేసుకోవచ్చని సిద్ధరామయ్య సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

65 ఏళ్లు పైబడిన పౌరులు కర్నాటకలోని 400 ఆలయాల్లో హ్యాపీగా దర్శనం చేసుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  రాష్ట్రంలోని ఏ, బీ కేటగిరీ ఆలయాల్లో క్యూలో వెయిట్​ చేయాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష దర్శనానికి అనుమతిస్తూ ముజ్రాయి శాఖ ఓ సర్క్యులర్​ని జారీ చేసింది. కర్నాటక హిందూ దేవాలయాల అర్చకరా ఫెడరేషన్‌ అభ్యర్థన మేరకు మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలోని ముజ్రాయి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఇప్పటి నుండి 65 ఏళ్లు పైబడిన పౌరులు తమ ఆధార్ లేదా వారి వయస్సును చూపే ఏదైనా గుర్తింపు కార్డును చూపించి, క్యూలో వేచి ఉండకుండా నేరుగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ముజ్రాయి శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఏ, బీ కేటగిరీ ఆలయాల్లోనూ ఈ పద్ధతి వర్తిస్తుందన్నారు.

కాగా, కుక్కే సుబ్రహ్మణ్యం, మైసూరులోని చాముండేశ్వరి ఆలయం, సవదత్తిలోని ఎల్లమ్మ ఆలయం, బనశంకరి ఆలయం, కొల్లూరు మూకాంబిక, బెంగళూరులోని గవిగంగాధరేశ్వర ఆలయం వంటి రాష్ట్రవ్యాప్తంగా 400 ఆలయాల్లో 65 ఏండ్లు పైబడిన వారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

ఇక.. హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖలు కూడా ఈ ఉత్తర్వును అమలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని ఆలయాలను ఆదేశించింది. సీనియర్ సిటిజన్లకు సహాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement