Saturday, April 27, 2024

తెలంగాణలో పీవీ పేరుతో కొత్త జిల్లా ?

తెలంగాణలో త్వరలోనే మరో కొత్త జిల్లా ఏర్పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయనుండటంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడ గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పీవీ శ‌త‌జ‌యంతి ముగింపు ఉత్స‌వాల‌ను ఈటెల‌పై ప్ర‌ధాన అస్త్రంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ కేంద్రంగా మాజీ ప్ర‌ధాని పీవీ నర్సింహారావు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తాజాగా టీఆర్ఎస్ నేత‌లు తెర‌పైకి తేవ‌డం ఇందుకు బ‌లాన్నిస్తోంది. పీవీ పేరుతో హుజురాబాద్‌లో ఈటెల గుర్తుల‌ను శాశ్వ‌తంగా చెరిపేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకుని స్థానిక నేత‌లు హుజురాబాద్‌ను జిల్లాగా ప్ర‌క‌టించాల‌న్న వాద‌న‌ను గ‌ట్టిగా వినిపిస్తున్నారు. ఈటెలను ఓడించేందుకు ఏ ఒక్క అవ‌కాశాన్ని టీఆర్ఎస్ వ‌దులుకోవ‌ద్ద‌ని భావిస్తుండ‌టంతో ఆ పార్టీ నేతలు ఈ ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తెస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం పీవీ శతజయంతి ఉత్స‌వాలను అధికారికంగా నిర్వ‌హిస్తుండ‌టం, ఆయన కూతురికి ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చి ఉండ‌టంతో.. పీవీ పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేస్తే.. ఆయ‌న్ను గొప్ప‌గా గౌర‌వించుకున్న‌ట్టు అవుతుంద‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. పైగా ఈనెల 28న పీవీ శతజయంతి ఉన్నందున ఇదే సరైన సమయమ‌ని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్తున్నారు.

ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో భాగంగా ఉన్న‌ హుజూరాబాద్‌, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్‌, చిగురుమామిడి మండలాలు.. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఉన్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాలు.. సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ రూరల్‌, కోహెడ‌, బెజ్జంకి మండ‌లాలో క‌లిపి పీవీ పేరుతో ఏర్పాటు చేసే జిల్లాలో చేర్చాల‌న్న ప్ర‌తిపాద‌న చేస్తున్నారు. పీవీ స్వ‌గ్రామం వంగర కూడా ఈ ప్రాంతానికే చెందిన‌దే కావ‌డంతో.. ఎటువంటి అభ్యంత‌రాలు రాబోవ‌ని చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలోనే పీవీ జిల్లాను ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్లు వినిపించాయి. అయితే క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ న‌గ‌రాలు ద‌గ్గ‌ర‌లోనే ఉండ‌టంతో… హుజురాబాద్ కేంద్రంగా కొత్త‌గా జిల్లా అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక వ‌స్తుండ‌టంతో హుజురాబాద్‌ను జిల్లాగా చేస్తే.. క‌చ్చితంగా ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపు నిల‌బ‌డ‌తార‌ని కేసీఆర్ కూడా భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement