Saturday, April 27, 2024

ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో… మెద్వెదెవ్‌తో నాదల్ ఢీ..

ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ రష్యాకు చెందిన మెదెదెవ్‌ ఫైనల్లోకి దూసుకువెళ్లారు. ఆదివారం జరిగే టైటిల్‌ పోరు వీరు అమీతుమీ తేల్చుకోనున్నారు. నాదల్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఆరోసారి. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు ఒక్క విజయం దూరంలో ఉన్న నాదల్‌ ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో 21వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్‌ టైటిల్‌ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పనున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాదల్‌ ఇటలీకి చెందిన మాటియో బెరెటినిపై హోరాహోరీగా పోరాడి విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నాదల్‌ 6-3, 6-2, 3-6, 6-3తేడాతో ఏడోసీడ్‌ బెరెటినిపై గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లాడు. 2గంటల 56నిమిషాలపాటు జరగిన సెమీస్‌పోరులో స్పెయిన్‌ బుల్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగే తుదిపోరులో తలపడనున్నాడు. సిస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, సెర్బియా స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌తో కలిసి ప్రస్తుతం నాదల్‌ సంయుక్తంగా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సమంగా ఉన్నాడు.

అయితే ఫెదరర్‌ మోకాలి గాయంనుంచి కోలుకోకపోవడంతో ముందే ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి తప్పుకున్నాడు. టాప్‌సీడ్‌ జకోవిచ్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌లో ఆడేందుకు మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోని కారణంతో అతడిని బోర్డర్‌ అధికారులు అడ్డుకున్నారు. న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో బహిష్కరణ వేటును ఎదుర్కొన్న జకో స్వదేశం సెర్బియాకు వెళ్లిపోయాడు. దీంతో నాదల్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఫైనల్‌కు చేరుకున్నాడు. జకోవిచ్‌ వైదొలగడంతో టైటిల్‌ విన్నర్‌గా నిలిచేందుకు మార్గం సుగమమైంది. నాదల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిస్తే మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రెండుసార్లు గెలుచుకున్న జకోవిచ్‌, రాయ్‌ ఎమర్సన్‌, రాడ్‌ లేవర్‌ సరసన నిలుస్తాడు. ఆరోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన 35ఏళ్ల స్పానిష్‌ దిగ్గజం నాదల్‌ 2009లో టైటిల్‌ను గెలుచుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement