Saturday, April 27, 2024

తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు!

సినీ ప్రియులకు స్వీట్ న్యూస్. థియేటర్ లో సినిమా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు రెడీగా ఉండడండి. తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గడంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తెలంగాణలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో శనివారం తమ సమస్యలను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, థియేటర్ల యాజమాన్యంకు చెందిన ప్రతినిథులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి తీసుకెళ్ళారు. తమ ఇబ్బందులను లిఖితపూర్వకంగా మంత్రికి అందచేశారు. వారి సమస్యలపై మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుండి తమ సినిమా థియేటర్లను తెరుస్తామని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. అందుబాటులో ఉన్న చిత్రాలతో తొలుత ప్రదర్శన మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. 

మరోవైపు అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది. కొత్త చిత్రాలను విడుదల చేయడం మొదలు పెడితే, థియేటర్లు కళకళలాడటం ఖాయం. కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా తెలంగాణలో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా సినిమాలు తమ రిలీజ్‌ డేట్స్‌ ను వాయిదా వేసుకున్నాయి. ఇక ఇటు కరోనా సెకండ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్స్‌ ఓపెన్‌ చేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.

ఇది కూడా చదవండి: టీటీడీ చైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి!

Advertisement

తాజా వార్తలు

Advertisement