Friday, April 26, 2024

కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చా?

కరోనా పాజిటివ్ వచ్చిన మహిళలు అప్పుడే పుట్టిన తమ శిశువుకు పాలు ఇవ్వొచ్చా లేదా అని చాలా మందిలో సందేహాలు వస్తున్నాయి. దీనిపై ప్రముఖ వైద్యులు స్పందించారు. కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో రెండు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిసారి శిశువును దగ్గరకు తీసుకోకూడదని.. మిగతా సమయంలో వేరే వాళ్లకు ఇవ్వాలన్నారు. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదన్నారు.

మొదటి వేవ్ కరోనా కంటే సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. అందులో కూడా 4 శాతం వరకు చిన్నారులకు కూడా సోకుతోంది. కానీ అది తీవ్ర సమస్యకు గురికాకుండా స్వల్ఫ లక్షణాలతో రికవరీ అవుతున్నారు. చిన్నారుల్లో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణం మాత్రం చిన్నారుల్లో కనిపించడం లేదని తెలిపారు. జ్వరం వచ్చి రెండు మూడు రోజుల దాకా నయం కాకపోతే పారాసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి వేయాలన్నారు. అప్పడే పాపకు జన్మనిచ్చే తల్లికి పాజిటివ్ ఉండి శిశువుకు నెగిటివ్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఆ లక్షణాలు మళ్లీ రెండు మూడు రోజుల తర్వాత బయట పడతాయన్నారు. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. మాస్కులు కూడా మూడేళ్లు పైబడిన పిల్లలు మాత్రమే ధరించాలని.. మూడేళ్ల వయసు లోపు పిల్లలు ధరించాల్సిన అవసరం లేదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement