Friday, April 26, 2024

రైతులపై మ‌రింత భారం.. హమాలీ ఖ‌ర్చుకింద‌ క్వింటాకు 52, తరుగు పేరిట 3కిలోలు ఫ‌ట్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు వ‌డ్లు అమ్ముకోవచ్చని భావిస్తున్న రైతులు.. పలు రకాల ఖర్చులతో తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కావాలంటే క్వింటాకు రూ.52 హమాలీ చార్జీ కింద చెల్లించాల్సి వస్తోంది. దీంతో హమాలీ ఛార్జీలు రైతులకు భారంగా మారాయి. గతంలో హమాలీ ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేది. ప్రస్తుతం హమాలీ ఛార్జీలు చెల్లించలేమంటూ ప్రభుత్వంచేతులెత్తేయడంతో రైతులే ఈ భారాన్ని భరించాల్సి వస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. హమాలీ ఖర్చులు తీసేయగా రైతుకు లభిస్తున్న మద్దతు ధర రూ.1900(1960-52)కే పరిమితమవుతోంది. మరికొన్ని చోట్ల హమాలీలు కేవలం ధాన్యం తూకానికే పరిమితమవుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఎత్తడం రైతులకు అదనపు భారమవుతోంది. ధాన్యాన్ని ఎత్తినందుకు అదనంగా మరికొంత ఛార్జీని వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పైగా ఒక్కో గ్రామంలో హామాలీలు ఒక్కో ధరను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు, వర్షాల కారణంగా హమాలీలు అడిగినంతా రైతులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌ ఏ రకం ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 మద్దతు ధరగా చెల్లిస్తోంది.

కిలో ధాన్యం కూడా తరుగుతీయొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించినా ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తరుగు పేరిట 40 కిలోల బస్తాకు కేజీ ధాన్యాన్ని తరుగు తీస్తున్నారు. క్వింటా ధాన్యానికి 2 నుంచి 3 కిలోల ధాన్యాన్ని తరుగుపేరిట రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోవడంతో హమాలీ కూలీని ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ. సాగర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి గంగుల కమలాకర్‌ చొరవ తీసుకుని హమాలీ ఛార్జీలను పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చూడాలని కోరారు.

అద్దె ఫ్యాన్‌తో ధాన్యం తూర్పారా…

హమాలీ ఛార్జీలతోపాటు మెజారిటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు లేకపోవడంతో రైతులు అద్దెకు మోటారు ఫ్యాన్లను తెచ్చుకుని ధాన్యాన్ని తూర్పార బడుతున్నారు. ఒక్క పూట ఫ్యాన్‌కు యజమానులు అద్దె కింద రూ.800 దాకా వసూలు చేస్తున్నారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ క్లీనర్లను సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పౌరసరఫరాశాఖ అధికారులు విఫలమవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement