Sunday, May 19, 2024

అమ్మ ఇక్కడ… నాన్న అక్కడ.. మా పరిస్థితి ఏమిటి ?

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ (ప్రభ న్యూస్) 25: అమ్మ అక్కడ డ్యూటీ…. నాన్న ఇక్కడ డ్యూటీ… నా పరిస్థితి ఏమిటి అంటూ.. ఉపాధ్యాయుల పిల్లలు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కి స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటే ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తమ పిల్లలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మా నాన్నలను కలపండి అంటూ ప్లకార్డులతో ఉపాధ్యాయుల పిల్లలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర కో కన్వీనర్ నరేష్ మాట్లాడారు. 13 జిల్లాల్లో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరమ్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పౌజ్ బాధితుల్లో 80 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని తమ గోడుని మొరపెట్టుకున్నారు.

2100 స్పౌజ్ అప్పీల్లలో కేవలం 30% మంది దంపతులకే బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల్లో ఆవేదన మిగిలిందని మహిళా ఉపాధ్యాయులు వాపోయారు. ప్రతిరోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, డ్యూటీలు చేస్తూ కష్ట నష్టాలను పడుతున్న వారిలో 80శాతం మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఎక్కువ మందికి అయిదు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు ఉన్నారని, ఇంకా 25 సంవత్సరాల పైబడిన సర్వీసు ఉందన్నారు. ఇటు కుటుంబానికి అటు విద్య బోధనకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేక మహిళా ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనకు లోనవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 13 జిల్లాల్లో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరమ్ సభ్యులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు చేపట్టాలని లేనియెడల.. ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరమ్ సభ్యులు, ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement