Saturday, May 11, 2024

మనసు దోచే చిత్రాలు.. ఈ ఫొటోలకు మీరూ ఓటెయ్యొచ్చు..

లండన్: అవును.. కొన్ని ఫోటోలను చూస్తే ఎలా తీశారబ్బా అనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే కళ్లు తిప్పుకోబుద్ధికాదు. కావాలంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్న కొన్ని ఫోటోలను. వ్యయప్రయాసలతో, అభినివేశంతో ఫోటోగ్రాఫర్ల పనితనానికి, వన్యప్రాణుల జీవన విదానానికి మచ్చుతునకలు ఇవి. ఇంతకీ ఈ చిత్రాలు మీకు నచ్చాయా.. అయితే బాగా నచ్చినవాటికి ఓటేయొచ్చు. ఇంతకీ అసలు విషయంలోకి వద్దాం. ప్రపంచ ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ఏటా అంతర్జాతీయ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అవార్డులకోసం పోటీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే పీపుల్స్ చాయిస్ పేరిట విడిగా కొన్ని ఫోటోలను ఎంపిక చేసి ఆన్ లైన్ ఓటింగ్ కు వెబ్ సైట్ లో పెడుతుంది. ప్రేక్షకుల ఆదరణ పొందిన టాప్ 3 కి బహుమతులు ఇస్తుంది.

ప్రస్తుతం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ 2021, పీపుల్స్ చాయిస్ పోటీకి శ్రీకారం చుట్టింది. ఎంట్రీలను ఆహ్వానించింది. 95 దేశాలకు చెందిన వందలాదిమంది ఫోటోగ్రాఫర్లు తమ ఎంట్రీలను పంపారు. దాదాపు 50వేల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 25 ఫోటోలను తుది పోటీకి ఎంపిక చేసి ఆన్ లైన్ లో పెట్టారు. ఇప్పుడు వీటిపై ఓటింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి 2022 ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఓటింగ్ లో పాల్గొనచ్చు. జూన్ 5న తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సందర్భంగా ఈ పోటీ న్యాయనిర్ణేతల్లో ఒకరైన నేషనల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డా.నటాలియా కూపర్ మాట్లాడుతూ.. ప్రకృతితో మానవులకు ఉన్న సంబంధం ఎంత అందమైనదో, ప్రకృతి రహస్యాలను కనుగొనడంతో మానవుడి ఉత్సుకత ఎంత గాఢమైనదో, ఈ అన్వేషణలో అనిర్వచనీయమైన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మన కళ్లముందు మెదలాడతాయో తెలుసుకోవాలంటే.. ఈ పోటీకి వచ్చిన ఎంట్రీలను చూడాలంటారు.

చైనాకు చెందన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఖియాంగ్, ఆకర్షణీయమైన రంగులతో అలరించే రెండు మేల్ గోల్డెన్ ఫీజెంట్లు (నెమలిజాతి పక్షులు) ఎగురుతూ చేస్తున్న విన్యాసాలను తన కెమేరాలో బంధించారు. సాధారణంగా ఈ సిగ్గరి పక్షులు ప్రజలముందుకు రావడానికి ఇష్టపడవు. అలాగే, షువాంగ్ బన్నా బొటానికల్ గార్డెన్ లో ఓ గొల్లభామను చీమలు ప్రణాళిక ప్రకారం ఈడ్చుకువెడుతున్న మింఘ్యూ క్లిక్ మన్పించాడు. ఇక చైనాలోని క్విన్ లింగ్ పర్వతాల్లో కనిపించే సిచువాన్ పొట్టిముక్కు కోతుల్లో ఓ తల్లి వానరం ఒడిలో నిద్రపోతున్న ఓ బుజ్జి వానరం ముద్దొస్తూంటే ఆష్లే అనే ఫోటోగ్రాప్ నింపాదిగా ఫోటో తీశాడు. అలాగే ఈక్వెడార్ లోని టీనా సమీపంలో అమెజాన్ అడవుల్లో ప్రత్యేకంగా కనిపించే ఫిమేల్ థోర్న్డ్ ఆర్బ్ వీవర్ స్పైడర్ చంద్రుడ్ని అమాంతం పట్టుకుందా అన్నట్లు భ్రమ కల్పించే అందమైన దృశ్యాన్ని జావెర్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమేరాలో ఓపికగా బంధించాడు. ఇలాంటి అందమైన ఫోటోలు తుది ఎంట్రీలలో ఎన్నో ఉన్నాయి. మీరు ఓటువేయాలనుకుంటే నేచురల్ హిస్టరీ మ్యూజియం వెబ్ సైట్ కు ఓ సారి వెళ్లాలి మరి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement