Tuesday, May 14, 2024

మేం కలుగజేసుకోం, స్పీకర్‌ను కలవండి.. సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు విచారణను ముగించింది. సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం స్పీకర్‌ను కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో సోమవారం ఉదయం నుంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సస్పెన్షన్‌పై సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చేందుకు నిరాకరించగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ధర్మాసనం వద్ద అప్పీలు దాఖలు చేసి అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం ఈ అంశాన్ని ప్రస్తావించినపుడే అసెంబ్లి కార్యదర్శికి తాము నోటీసులు ఇచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఆయన సహకరించలేదని, ఉద్దేశ్యపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని అసెంబ్లీ కార్యదర్శికి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు సిబ్బంది లోపలికి వెళ్ళి కార్యదర్శికి నోటీసులు ఇచ్చే విధంగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ మధ్యాహ్నం అసెంబ్లికి వెళ్ళి నోటీసులు అందజేశారు. కార్యదర్శి నోటీసులు తీసుకున్నట్లు సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన విచారణ సందర్భంగా జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌రెడ్డి వాదనలను వినిపిస్తూ శాసనసభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్‌ చేశారని కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ ఎలాంటి ప్రస్తావన చేయకుండానే నేరుగా మంత్రి తీర్మానం ప్రవేశపెట్టడం, వెంటనే దాన్ని ఆమోదించడం అంతా ముందస్తు ప్రణాళికతో చేశారు కాబట్టి వెంటనే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరారు. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం స్పీకరే తీసుకోవాలని కోర్టు తెలిపింది. మంగళవారం సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవాలని సూచించిన కోర్టు వారిని స్పీకర్‌తో కలిపే బాధ్యత కార్యదర్శి తీసుకోవాలని ఆదేశించింది. ఈ అంశంలో స్పీకర్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. ఎంఎల్‌ఏలు సభ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.

ఆర్టికల్‌ 14,19,21 ప్రకారం సభ్యుల హక్కులకు భంగం వాటిల్లుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ అసెంబ్లి వ్యవహారాల్లో కోర్ట్ లు కలగచేసుకోవచ్చని పేర్కొంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సభ ఉంటుంది కనుక సభాపతిగా ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉండాల్సింది సభలో కానీ బయట కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే ప్రశ్నించేవారూ ఉండాలని తెలుపుతూ విచారణను కోర్టు ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement