Wednesday, May 15, 2024

Mahashivratri: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సందర్భంగా శ్రీశైలం మ‌ల్ల‌న్న ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. క్యూలైన్ల‌న్ని భ‌క్తుల‌తో నిండిపోయాయి. సోమవారం రాత్రి నుంచే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా తరలి వచ్చారు. స్వామి వారి ఉచిత ద‌ర్శ‌నానికి 6 గంట‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నానికి 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. పాతాళ‌గంగ వ‌ద్ద భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తున్నారు.

మరోవైపు శివ మాలలు ధరించి నల్లమల అభయారణ్యం గుండా పాద యాత్రలతో మల్లన్న సన్నిధానంకు భారీ ఎత్తున శివస్వాములు తరలివస్తున్నారు. ఇరుముడులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌భోత్స‌వం నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులను ప్రభోత్సవంపై పురవీధుల్లో ఊరేగించనున్నారు. స్వామి వారికి లింగోద్భ‌వ‌కాల మ‌హాన్యాస పూర్వ‌క ఏకాద‌శ రుద్రాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 10 గంట‌ల నుంచి ఆల‌య విమాన గోపురానికి పాగాలంక‌ర‌ణ చేయ‌నున్నారు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు బ్ర‌హ్మోత్స‌వ క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీశైలం ఈవో లవన్న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement