Friday, April 26, 2024

Big Story: త్వరలో ల్యాండ్‌ పూలింగ్‌ పాలసీ.. చట్టంలో మార్పులకు తెలంగాణ సర్కార్‌ యోచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో భూ సేకరణకు వీలుగా ప్రత్యేక చట్టం దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు అనువుగా ల్యాండ్‌ పూలింగ్‌ పద్దతిని మరింత పకడ్బంధీ చేసేందుకు కార్యాచరణ చేస్తోంది.. ఈ విధానాన్ని హైదరాబాద్‌ వంటి నగరాలే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేసి భూ సేకరణ జరిపేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో సీఎం కేసీఆర్‌ ఈ విధానంపై ఉన్నతస్థాయిలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ముసాయిదాపై చర్చించి ఇందులోని మంచి చెడులను భేరీ.ఉ వేసిన తర్వాత కీలక నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ల్యాండ్‌ పూలింగ్‌ పద్దతిపై ప్రభుత్వ వర్గాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో అమలులో ఉన్న పాలసీలు, పద్దతులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇస్తున్న ప్రాధాన్యతలను గుర్తించాయి. అక్కడి ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాలు, ల్యాండ్‌ పూలింగ్‌ మంచి చెడులతోపాటు, ప్రాజెక్టుల పురోగతి, అమలులో ఎదురవుతున్న మంచిని అంచనా వేశాయి. ఈ మేరకు ఆయా అంశాలతో కూడిన నివేదికలను ప్రభుత్వానికి అందించాయి.

ఈ నేపథ్యంలో త్వరలో ల్యాండ్‌ పూలింగ్‌తో పెండింగ్‌ ప్రాజెక్టులతోపాటు, ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న అనేక కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రజోపయోగ కార్యక్రమాలకు భూ సేకరణ, ప్రభుత్వ ఆధీనంలో వెంచర్ల వంటి వాటిపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ పరిధిలో మాత్రమే ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూ సేకరణ జరిపారు. లేమూరు, దండుమైలారం, బోగారంలలో 565 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు అమలులోకి తెచ్చారు. పైలెట్‌గా ఈ పథకం అద్బుతంగా విజయవంతమైంది.

ల్యాండ్‌ పూలింగ్‌ విధానంతో భూ సేకరణకు వెచ్చించే వ్యయం తగ్గుతుందని, మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వమే చేయనుందని అధికారులు చెబుతున్నారు. భూమి యాజమాన్యాలకు కూడా ప్రాజెక్టులో భాగస్వాములుగా అవకాశమిచ్చి వారిని కూడా ఎదిగేలా సహకరిస్తారు. దీంతో న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా సాఫీగా లక్ష్యం చేరొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపి కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

టౌన్‌షిప్‌లు, పేదల ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టులకు మేలు…
తద్వారా శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, పేద, గడుగు, బలహీనవర్గాల గృహనిర్మాణ ప్రాజెక్టుల వంటివాటికి కొత్త విధానంలో చోటు కల్పించనున్నారు. ఆయా కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి ఈ విధానం ఉపకరించనుంది. భూ సమీకరణ ద్వారా సమీకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను మున్సిపల్‌ శాఖకు అప్పగించనున్నారు.
దీంతో పర్మిషన్లు, ఇతర వ్యవహారాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకొవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రైవేట్‌ డెవలపర్లు అభివృద్ధిచేస్తున్న నిర్మాణరంగ ప్రాజెక్టులలో రహదారులు, డ్రైనేజీలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు నాణ్యతాలోపంతో దెబ్బతింటున్నాయని, ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వమే పనులను పూర్తిచేసి నాణ్యతతో అందించేలా చట్టంలో చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -

ధరల పెరుగుదలతో…
తెలంగాణలో ఇప్పుడు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎక్కడ మారుమూల చూసినా రూ. 50లక్షలకు ఎకరం తగ్గడంలేదు. భారీగా పెరిగిన వ్యవసాయ భూముల ధరలతో ప్రభుత్వానికి కొత్త చిక్కులొస్తున్నాయి. రైతుబంధుతోపాటు, వ్యవసాయానికి ఊతంగా ప్రాజెక్టుల రాకతో రైతులు భూములనమ్మేందుకు విముఖత చూపిస్తున్నారు. వ్యవసాయం చేయకున్నా ఏటికేడు భారీగా భూముల ధరలు పెరుగుతుండటంతో భూ సేకరణకు అనేక అవరోదాలొస్తున్నాయి. ఒకవైపు ప్రాజెక్టులు, రహదారులకు భూ సేకరణతోపాటు దళితులకు భూ పంపిణీపై పెను ప్రభావం పడుతోంది.

భూముల కొరతతోపాటు, అత్యంత ఖరీదుగా మారిన భూములతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడచిన ఆర్ధిక ఏడాదిలో రూ. 428 కోట్లను ప్రభుత్వం దళితుల భూ పంపిణీకి కేటాయించింది. దీంతో 10వేల మంది లబ్దిదారులకు అవసరమైన భూములను కొనుగోలు చేసి పంచడంద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు తేవాలని యోచించారు. అయితే క్షేత్ర స్థాయిలో భూముల కొనుగోలుకు అధికారులు ప్రయత్నించగా భూములు దొరకడమే గగనంకాగా, ప్రభుత్వ నిర్ధేశిత ధరకు ఏ మారుమూలకు వెళ్లినా భూములనమ్మేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి ఎదురైంది.

భూ పంపిణీకి 11 జిల్లాలకే ప్రణాళిక సిద్దం చేశారు. తొలుత 28 జిల్లాలకు పథకం ద్వారా భూములివ్వాలని ప్రభుత్వం భావించినా భూముల ధరలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ప్రభుత్వ భూములు లేకపోవడంతో జిల్లాల సంఖ్యను కుదిస్తూ వచ్చారు. ఆదిలాబాద్‌, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంభ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో భూ పంపిణీ పథకానికి యోచించారు. అయితే ఇందుకు అనుగుణంగా అధికారులకు సూచనలు వెళ్లగా, భూములు విక్రయించేవారు లేరని ప్రభుత్వానికి నివేదిక అందింది. విక్రయదారులనుంచి దరఖాస్తులు కోరగా పెద్దగా స్పందన రాలేదు.

కాగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించి, పరిహారం, పునరావాసం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎక్కడా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు సుమారుగా 2.7లక్షల ఎకరాల భూ సేకరణను అతి కష్టం మీద సాకారం చేసుకుంది.

సకల జాగ్రత్తలతో…
న్యాయపరమైన చిక్కులను ధీటుగా అధిగమిస్తూ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. చివరకు అటవీ భూముల సేకరణ కూడా పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను పొందుతూ ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణ అనుకున్న సమయంలో పూర్తి చేస్త్తున్నారు. మరోవైపు భూమి కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉండటం, ఇతర చోట్ల భూములు, ఇండ్ల స్థలాలను ఇవ్వడంతో ప్రగతి సాధ్యమవుతోంది. ప్రధానంగా భారీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుమారు 90 వేల ఎకరాలు సేకరించగా, వరంగల్‌లో 73వేల ఎకరాలు, మెదక్‌లో 57 వేల ఎకరాలను సేకరించి ప్రాజెక్టుల ప్రగతికి అవసరమైన కార్యాచరణను ఇబ్బందులున్నా చిత్తశుద్దితో పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement