Friday, April 26, 2024

కెసిఆర్ వ్యూహం ప‌క్కా…. గెలుపు లెక్క‌

కర్ణాటకలో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో తెలంగాణలోనూ ఎలక్షన్‌ ఫీవర్‌ పెరిగింది. అన్ని పార్టీల్లో ఒకటే దూకుడు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు. ఏది ఏమైనా అసెంబ్లి ఎన్నికలే అందరి టార్గెట్‌. అధికారంలోకి రావాలని కొన్ని పార్టీలు.. సర్కార్‌ను నిలబెట్టుకొని కేంద్రం చెంప చెళ్లుమనిపించాలని అధికార పార్టీ.. ఇలా ఎవరికి వారు లెక్కల మాస్టర్లుగా మారిపోయారు. నియోజకవర్గాల వారీగా లెక్కలను వేసుకుంటున్నారు. గెలుపు ఓటములపై కూడికలు, తీసివేతలతో ఆయా పార్టీ ముఖ్య నేతలు బిజి బిజీగా గడుపుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ జిల్లాల వారిగా విజయబావుటా ఎగరవేసే అసెంబ్లి స్థానాల వివరాలను రాసి పెట్టుకుంటున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లను గెలిచేలా వ్యూహాలను రచిస్తోంది….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గత రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీగా పోటీ చేసింది. ప్రస్తుతం పేరు మార్చుకొని జాతీయ పార్టీగా మార్పులు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీగా ప్రజల్లోకి వెళ్తోంది. గతంలో టీఆర్‌ఎస్‌ అంటే మన పార్టీ అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతూ వస్తుండేది. మెజార్టీ ప్రజలు కారుకు కంచుకోటగా నిలుస్తూ వచ్చారు. ఇప్పడు గుర్తు మారకున్నా.. పార్టీ పేరు మాత్రం మారింది. గుర్తు పాతదే కావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. అయితే ప్రతి నియోజకర్గం వారిగా సీఎం కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న పట్టు దలతో ఉన్నారు. ఇందు కోసం ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతను సైతం ఆరా తీస్తున్నారు. పార్టీ బలం ఎంత శాతం ఉంది.. ప్రతిపక్షాల అభ్యర్థులు బలంగా ఉన్నారా..? ఒక వేళ తమ అభ్యర్థి కాకుండా గెలిచే అభ్యర్థులు ఎవరు ఉన్నారు..? గత ఎన్నికల గెలుపు ఓటముల రికార్డులు కూడా తెప్పించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలిచారో కూడా లెక్కలు తీస్తున్నా రు. నోటిఫికేషన్ వచ్చే వరకు వ్యతిరేకత తగ్గకపోతే ఆ స్థానంలో ఏం చేయాలో కూడా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు. ఎంఐఎం స్థానాలు మినహా మిగతా అన్ని స్థానాలకు సంబంధించిన కూడికలు, తీసివేతలు చేస్తూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌
అసెంబ్లి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు తాజా రిపోర్టును సీఎం కేసీఆర్‌కు అందజేస్తున్నారు. పార్టీల గెలుపు ఓటములకు సంబంధించి కూడా వివరాలను సేకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏమిటీ..? ఏం కోరుకుంటున్నారు..? ఎందుకు తమ పార్టీపై వ్యతిరేకత ఉంది..? ఎమ్మెల్యే పని తీరు బాగోలేదా..? లాంటి 20 అంశాలకు సంబంధించిన వివరాలను గులాబీ బాస్‌ తెప్పించుకుంటున్నారు. గెలిచేందుకు ప్రతిపక్షాల అభ్యర్థులు కారు పార్టీకి ఎలా ఉపయోగపడతారన్న అంశంలోనూ ఆలోచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5 వేలకు మించి మెజార్టీ రానీ వారిని స్థానికంగానే తిష్ట వేసుకొని ఉండాలని సూచించారు. అయితే ఇప్పటికి వ్యాపార లావాదేవీలల్లో పడిన కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి ఓదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వివరాలను కూడా సేకరించి పెట్టారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా..? ప్రజల స్పందన ఎలా ఉంది..? లబ్ధిదారులు పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారా లేదా..? అని కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది..? పల్లెల్లో ప్రజలు సొంత ఎమ్మెల్యే పని తీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారు..? లాంటి వాటిని కూడా గెలుపు ఓటముల లెక్కల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యేల చిట్టా పద్దులు
రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేల చిట్టా పద్దులు సీఎం కేసీఆర్‌ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల బలం, బలహీనతలను కూడా కేసీఆర్‌ పసిగట్టారు. ఆర్థిక, అంగ బలం ఎంత మేరకు ఉన్నాయో కూడా రాసి పెట్టుకున్నారు. ఆర్థిక బలం లేని వ్యక్తులకు పార్టీ నుంచి ఎవరెవరికి సపోర్ట్‌ చేయాలో కూడా వివరాలను తీశారు. ఈ ఎన్నికల్లో పార్టీ రూల్స్‌ను వినకుండా తోక జాడిస్తే.. అలాంటి వారిపై చర్యలకు కూడా వెనకాడేది లేదన్న ఆలోచనలో ఉన్నారు. అసమ్మతి రాగం వినిపిస్తే దారిలో పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే సమ్మేళనాలతో అసమ్మతి వర్గాన్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం మొదలైంది. వచ్చే నెల ముగిసే లోపు అందరు సక్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్‌ చేశారు. ఎమ్మెల్యేలను పల్లెలు వదిలి పట్నం రావద్దని అల్టిమేటం జారీ చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

స్థానిక నేతలు వద్దు.. పార్టీనే ముద్దు
గ్రామాల్లో గులాబీ పార్టీ అంటే ఇష్టమున్నా.. స్థానిక లీడర్లు చేసే అన్యాయాలు, అక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూ దందాలు, పోలీసు కేసులు, అక్రమ వసూల్లు, బెదిరింపులు, దాడులు లాంటివి మండల స్థాయి లీడర్లు చేయడంతో ఆ నేతలపై స్థానిక ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌.. అంటే అభిమానం ఉందంటూ తెలుపుతున్నారు. కానీ తమ కష్టాలు, బాధలు పెద్ద సార్లకు తెలవకుండా కింది స్థాయిలోనే అడ్డుకుంటున్నారని తెలుపుతున్నారు. మున్సిపాలిటీలు, మేజర్‌ గ్రామ పంచాయితీలు, మండలాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాలకు ప్రధాన కారణం ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన లీడర్లేనని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. కేవలం లాభా పేక్షతోనే పార్టీలో ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న లీడర్లపై స్థానిక ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ఇలాంటి వారు చేయబట్టే బీఆర్‌ఎస్‌పై కొంత అసంతృప్తితో ప్రజానీకం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగంగానే దందాలు, దాడులు, అక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఆ సెగ ఎమ్మెల్యేలకు తగిలే అవకాశం ఉంది. అన్యాయాలు చేసే లీడర్లను అదుపు చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందని సొంత పార్టీలోని నేతలే సూచిస్తున్నారు. మరి బాస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement