Monday, May 6, 2024

Water Crisis: తుంగభద్రపై కర్నాటక కొత్త ప్రాజెక్టులు, తెలంగాణకు వరద జలాలు కష్టమే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్రపై నిర్మించ తలపెట్టిన అప్పర్‌ భద్ర, నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలానికి వరద ప్రవావం చాలా మేర తగ్గుతుందని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరద తగ్గడంతోపాటు వర్షాకాలంలో వరద రావడం కూడా జాప్యం జరుగుతుందని జలసౌద అధికారులు అంటున్నారు. ఇక వర్షాభావ పరిస్తితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశమే ఉండదని రాబోయే ప్రమాద పరిస్థితులను అంచనా వేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మూడో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కర్నాటక రాష్ట్ర నూతన ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయాలని తెలంగాణ ఇప్పటికే నిర్ణయించింది.

కర్నాటక నూతన ప్రాజెక్టులతో కృష్ణాబేసి న్‌లోని తెలంగాణ ఆయకట్టు, ప్రాజెక్టుల కు జరిగే నష్టంపై కృష్ణా బేసిన్‌ వ్యవహారాలను చూసే అధికారులు ఇప్పటికే అంచనాలను రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 29.9 టీఎంసీల వరద జలాలు తరలించే సామర్థ్యంతో అప్పర్‌ భద్ర నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదే సమయంలో తుంగ భద్ర జలాశయానికి ఎగువ వరద కాల్వతోపాటు 52 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నావలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌లను సిద్ధం చేసింది. వరద సమయంలో జలాశయం నుంచి వరద కాలువ ద్వారాబ్యాలెన్సింగ్‌ రిజర్వాయకకు నీళ్లను మళ్లించి, ఎగువ నుంచి ఎక్కువుగా వచ్చే నీటిని నావలి రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. ఆ తర్వాత అవసరమైన సమయంలో దిగువకు వరదను వదిలే విధంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. కృష్ణా ట్రిబ్యునల్‌ -1 230 టీఎంసీలను కేటాయించగా 212 టీఎంసీలను నికరంగా వాడుకునే హక్కు తమకు ఉందని, అయితే ప్రస్తుత తుంగభద్ర డ్యాంలో ఏటేటా పూడిక పేరుకుపోతుండడంతో నిల్వ సామర్యం తగ్గిందని, ఏటా జులై, ఆగస్టు నెలల్లోనే భారీ వరదలు వస్తుండడంతో నీ ళ్లను నిల్వ చేసుకునే పరిస్థితి లేనందున కొత్తగా అప్పర్‌ భద్ర, నావలి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు కర్ణాటక వాదిస్తోంది.

తుంగభద్రలో పూడికను తొలగించేందుకు ఎక్కువ ఖర్చు అవుతోందని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ప్రాజెక్టును నిర్మిస్తే తక్కువ సమయంలో నీటి నిల్వ సమస్య పరిష్కారమవుతుందని చెబుతోంది. నావలి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించేందుకు తాము సిద్ధమని సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే పలుమార్లు కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే కృష్ణా బేసిన్‌లోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కర్ణాటక తలపెట్టిన నూతన ప్రాజెక్టుల పై ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక తలపెట్టిన నూతన ప్రాజెక్టుల నిర్మాణ ప్రయత్నాలను దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా కల్పించేందుకు ముందుకు రావడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement