Wednesday, April 24, 2024

స్కూల్‌పై రష్యా బాంబులు, 60మంది మృతి..

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయానికి సంకేతంగా సోమవారంనాడు భారీఎత్తున ఉత్సవాల నిర్వహించ తలపెట్టిన రష్యా రిహార్సల్స్‌లో తలమునకలైనప్పటికీ ఉక్రెయిన్‌పై మాత్రం వెనక్కు తగ్గడం లేదు. శనివారంనాడు దాడులు ముమ్మరం చేసింది. రాజధాని కీవ్‌ సమీపంలోని పట్టణాలు, ఖార్కీవ్‌, ఒడెసాలలోని అనేక ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. యుద్ధం నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు దాదాపు వందమంది తలదాచుకున్న ఓ స్కూల్‌పై శనివారం పొద్దుపోయాక బాంబులు జారవిడిచింది. లుషాంక్‌ రీజియన్‌లోని బిలోహోరివ్కా పట్టణంలో రష్యా ఈ దారుణానికి పాల్పడింది. బాంబుల ధాటికి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి తరువాత స్కూల్‌ భవనం కుప్పకూలిపోయింది. అందులో తలదాచుకున్న వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిలో 30మందిని సహాయక బృందాలు రక్షించగలిగాయి. మిగిలిన 60మంది శిథిలాల కింద నలిగి, ఊపిరాడక మృతి చెంది ఉంటారని అధికారులు ప్రకటించారు. మంటలతో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్‌పై రష్యా బాంబు దాడిని లుషాంక్‌ గవర్నర్‌ షెర్హియ్‌ గెయ్‌డాయ్‌ ఆదివారం ధ్రువీకరించారు.

కాగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడం దారుణమని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధనేరాలపై విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా డిమాండ్‌ చేశారు. కాగా రాజధాని కీవ్‌పైనా రష్యా దాడులకు పాల్పడుతోంది. గడచిన కొద్దిరోజులుగా రష్యా బాంబుదాడులు చేస్తోందని కీవ్‌ సమీపంలోని గ్రామాల్లో 200 ఇళ్లు నేలమట్టమయ్యాయని, 46 పాఠశాలలు, 30 చిన్నపిల్లల పాఠశాలలు, 70 భారీ భవంతులు కీవ్‌ మేయర్‌ విటాలి క్లిత్స్‌ కో ప్రకటించారు. మరోవైపు పోర్టు నగరం ఒడెశా, వొజ్నెసెన్‌స్క్‌ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై శనివారం క్షిపణులతో దాడి చేశామని, ఉక్రెయిన్‌ విమానాన్ని ధ్వంసం చేసామని రష్యా ప్రకటించింది. ఖార్కీవ్‌ సమీపంలోని అమెరికా, ఐరోపా యూనియన్‌లకు చెందిన ఆయుధ సామాగ్రిని ఇస్కాందర్‌ క్షిపణులతో పేల్చివేశామని వెల్లడించింది.

మరియపోల్‌లో వేగంగా తరలింపు ప్రక్రియ..

మరియపోల్‌లోని అజోవత్స్‌ల్‌ స్టీల్‌ప్లాంట్‌లో చిక్కుకుపోయిన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ఊపందుకుంది. ఐరాస చీఫ్‌ మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్‌-రష్యామధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాల్పుల విరమణ పాటించడంతో ఇది సాధ్యమైంది. తాజాగా శనివారం నాడు 300 మంది మహిళలు, వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు పంపామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement