Wednesday, May 8, 2024

నాగాలాండ్‌లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్.. రేపు ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మార్కెట్లలో భారత పర్యాటక రంగ ప్రాధాన్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నాగాలాండ్ రాజధాని కోహిమాలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌ను నిర్వహిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యాటకం, అక్కడి ప్రత్యేక పర్యాటక ఉత్పత్తుల ప్రదర్శన, చర్చలకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ పర్యాటక మార్ట్‌ను రేపు నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రారంభించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వాధికారులు, పరిశ్రమల వాటాదారులు, స్థానిక భాగస్వాములతో సహా 300 మంది ప్రతినిధులు హాజరవుతారు. ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్‌ కింద స్టడీ టూర్‌లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల బృందం కూడా ఇందులో పాల్గొంటారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో అస్సాంలోని గువాహాటిలో జరిగిన ఈశాన్య రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సుకు ఇది కొనసాగింపు.

ఈశాన్య ప్రాంతంలో రొటేషన్ ప్రాతిపదికన జరిగే అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఈ ఎడిషన్ దేశీయ పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈశాన్య ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై చర్చలతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలతో 8 రాష్ట్రాలకు మెరుగైన కనెక్టివిటీని పెంపొందించడం, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించేందుకు ఈ మార్ట్ వేదికగా పని చేస్తుంది. వివిధ పర్యాటక ఉత్పత్తుల కొనుగోలుదారులు, అమ్మకందారులు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర వాటాదారుల మధ్య పరస్పర అవగాహనకు ఇది దోహదపడుతుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు వారి పర్యాటక రంగ సామర్థ్యానికి సంబంధించిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది కొనుగోలుదారులు ఇందులో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement