Tuesday, May 7, 2024

నోబెల్ మ్యూజియంలో ‘భార‌తీయ‌త‌’..

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ‍‍ మేథావుల ఆలోచనలు ప్రపంచ గమనాన్ని మార్చగలవని నోబెల్‌ బహుమతి ప్రధానం చేసే కమిటీ భావిస్తోంది. నోబెల్‌ గ్రహతల సృజనాత్మకత, ధైర్యం, పట్టుదల, జీవనశైలి, స్పూర్తిదాయక విధివిధానాలు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో భవిష్యత్‌పై ఆశలు కలిగిస్తాయని దృడవిశ్వాసంతో ఉంది. నోబెల్‌ బహుమతిని విశిష్ట సమ్మేళన రంగాల ఆధారంగా శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సాహత్యం, ఆర్ధికం, శాంతి, తదితర రంగాల్లో సమకాలిన సమస్యలపై పరిశోధించి ఉత్తమ ఫలితాల్ని సాధించిన వారికి లభిస్తుంది. వీరికి జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. వారి ఆలోచనా సరళి నుంచి వస్త్రధారణ వరకు ప్రతి అంశం భవిష్యత్‌ దిశానిర్ధేశాలను శాసించగలిగేదే. అందుకే నోబెల్‌ విజేతలు వినియోగించిన వస్తువులను సాధారణ ప్రజలకు కూడా ప్రదర్శించేందుకు వీలుగా నోబెల్‌ కమిటీ ప్రత్యేకంగా ఓ మ్యూజియం నిర్వహస్తోంది. ఇందులో భారతీయ వస్త్రధారణలో కీలకమైన పురుషుల ధోతి, నెహూ జాకెట్‌, స్త్రీలు ధరించే చీర, జాకెట్‌లకు స్థానం లభించింది.

ఇందుకు ప్రధాన కారణం 2019లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని సంయుక్తంగా అందుకున్న దంపతులు అభిజిత్‌బెనర్జీ, ఈస్టర్‌ డుప్లో. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న నినాదం భారతీయుల నరనరానా జీర్ణించుకుంది. గతకొన్ని దశాబ్ధాలుగా భారతీయ సంతతి విదేశాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా రూపొందారు. వైద్యం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఎదిగారు. సాప్ట్‌వేర్‌ రంగంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఆర్దిక రంగంలోనూ తమ ప్రతిభను రుజువు చేసుకుంటున్నారు. రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. పలు దేశాల పాలనా వ్యవస్థల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
భారతీయ సంతతి ఏ దేశంలో ఎంతటి కీలక హూదాలో ఉన్నా నరనరానా జీర్ణించుకున్న భారతీయతను మాత్రం విడిచిపెట్టడం లేదు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీటేస్తున్నారు. వీలైన ప్రతి సందర్భంలో తమ భారతీయతను ప్రదర్శిస్తున్నారు. భారతీయ సంప్రదాయ వైభవానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తున్నారు. ఈ క్రమంలోనే 2019నోబెల్‌ బహుమతుని పొందిన అభిజిత్‌ దంపతులు ఆ బహుమతి స్వీకార సభకు భారతీయ దుస్తుల్తో హాజరయ్యారు. వాస్తవానికి ఇలాంటి అంతర్జాతీయ వేదికలపైకి సూటు, బూటులతోనే వెళ్తుంటారు. దేశమేదైనా ఇప్పుడు సూటుబూటు అన్నది అంతర్జాతీయ డ్రెస్‌ కోడ్‌గా మారిపోయింది. వీటిని ధరించని పక్షంలో చులకనగా చూస్తారన్న భయం కూడా నెలకొంది.
కానీ భారతీయ అమెరికన్‌ సంతతికి చెందిన ఆర్ధికవేత్త అభిజిత్‌బెనర్జీ ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి స్వీకారానికి భారతీయ సంప్రదాయ వస్త్రధారణతోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా నలుపుచొక్కాతో కూడిన కుర్తా ధరించారు. బంగారు అంచుగల తెల్లని ధోతి కట్టుకున్నారు. బెనర్జీ ఆలోచనలకు అతని భార్య డుప్లో కూడా సహకరించారు. వాస్తవానికి ఆమె ఫ్రెంచ్‌ అమెరికన్‌ సంతతికి చెందినవారు. ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడిచారు. ఎరుపు జాకెట్‌, ఆకుపచ్చ చీరను ధరించారు. ఎర్రని బొట్టు పెట్టుకున్నారు. భారతీయ మూలాలు లేకున్నా భారతీయ సంతతికి చెందిన భర్తకు అనుంగు చేదోడువాదోడుగా వ్యవహరించారు. వీరిద్దరూ భారతీయ వస్త్రధారణలో ఆనాటి సభకు హాజరై బహుమతిని స్వీకరించారు. అప్పట్లోనే ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమైంది. భారతీయుల్తో పాటు విదేశాల్లోని భారతీయ సంతతి అంతా ఈ దంపతులకు అభినందనలు తెలిపారు. స్టాక్‌హూమ్‌ కన్సల్ట్‌ హాల్లో అవార్డు ప్రదానోత్సవాన్ని స్వయంగా తిలకించిన ప్రతి ఒక్కరు వీరనుసరించిన భారతీయ సంప్రదాయాల పట్ల ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించేందుకు ఆధునిక ఆర్ధిక విధానాలు ఏ విధంగా ఉపకరిస్తాయన్న అంశంపై వీరు చేసిన పరిశోధనలకు మరో ఆర్ధిక శాస్త్రవేత్త మైఖేక్రీమెర్‌లతో కలసి వీరు ఈ నోబెల్‌ బహుమానాన్ని పంచుకున్నారు. బహుమతిగా అందిన సొమ్మును ఆర్ధిక శాస్త్రంలో పరిశోధనల కోసం వీరు విరాళంగా ప్రకటించారు. కాగా బహుమతి స్వీకార సందర్భంలో వీరు ధరించిన వస్త్రాల్ని ఇప్పుడు నోబెల్‌ ఫ్రైజ్‌ కమిటీ నిర్వహస్తున్న మ్యూజియంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement