Monday, April 29, 2024

Billionaires Migration – వ్యవస్థల్లో అవస్థలతో మనకెందుకు… మనం ఎగిరిపోదాం…

న్యూఢిల్లి ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – భారత్‌లోని సంపన్నులకిప్పుడు దుబాయ్‌, సింగపూర్‌లు స్వర్గథామాలుగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియాలవైపు వీరు చూస్తున్నారు. ఇక్కడ పలురకాలుగా ఆర్జించిన సంపదనంతా విదేశీమారకంగా మార్చుకుని మరీ దుబాయ్‌, సింగపూర్‌ లేదా ఇతర దేశాల్లో కుటుంబ సభ్యుల్తో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు పరుగులుదీస్తున్నారు. ఒకప్పుడు భారత్‌ సంస్కృతి, నాగరికతలకు విదేశీయులు ఆకర్షితులయ్యేవారు. సంప్రదా య, శాంతియుత జీవనాల కోసం ఇక్కడికొచ్చేవారు. భారత్‌ నుంచి ఉపాధి కోసం మాత్రమే పలువురు విదేశాలకు తరలెళ్ళేవారు. కాగా ఇప్పుడు భారత్‌ నుంచి సంపన్నుల వలస జోరుగా సాగుతున్నది. దేశంలో 3.57లక్షల మంది సంపన్నులున్నారు. వీరి సంఖ్య 2031నాటికి 80శాతం పెరుగుతుందని ఓ అంచనా. భారత్‌ ఇప్పుడు ఆసియాలోనే వివిధ సంపద కేంద్రాలకు నిలయంగా మారింది. ఓ వైపు భారత్‌ విదేశీయుల పెట్టుబడుల కోసం వెంపర్లాడుతుంటే ఈ దేశ మదుపరులు మాత్రం విదేశాల వైపు ఆకర్షితులౌతున్నారు. ఇక్కడ్నుంచి దుబాయ్‌, సింగపూర్‌, అమెరికా వంటి దేశాలకెళ్ళి స్థిరపడుతున్నవారంతా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకుంటున్నారు. ఈ దేశంతో గల అన్ని సంబంధాల్ని వదిలించుకుంటున్నారు.

ఇందుకు ప్రధానమైన కారణం ఇక్కడ శాంతియుత జీవనానికి భంగం వాటిల్లింది. తరచూ కుల, మత ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం నెలకొంది. వ్యవస్థల్లో లంచగొండితనం, అవినీతి పేరుకుపోయింది. సరైన విద్య, వైద్య వసతులు కొరవడ్డాయి. ముఖ్యంగా స్వేచ్ఛాయుత సుఖ జీవనానికి అవకాశంలేదు. శ్రమదోపిడీ, అభద్రతాభావాలు నెలకొన్నాయి. ప్రజల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత లోపించాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. సంపన్నులు ఈ పరిస్థితుల్లో భారత్‌లో సుఖంగా జీవించలేమన్న అభిప్రాయానికొచ్చేస్తున్నారు. తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్‌ అందించలేమని భయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ దేశం నుంచి వలసలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

గత దశాబ్ధంలో భారత్‌ నుంచి 16.25లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాల్లో స్థిరపడితే వీరిలో 8.37శాతం మంది సంపన్నులున్నారు. 16.87శాతం మంది వైద్య, ఇంజనీరింగ్‌ రంగాల నిపుణులున్నారు. వాస్తవానికి అమెరికా, చైనా, జపాన్‌ల తర్వాత సంపన్నుల సంఖ్యలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ్నుంచెళ్ళి విదేశాల్లో సుమారు 2కోట్ల మంది వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ సంపాదించిన మొత్తాన్ని వీరు భారత్‌కు పంపిస్తున్నారు. అయితే ఇక్కడున్న సంపన్నులు విదేశాలకు తరలిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 7,500మంది మిలియనీర్లు భారత్‌ నుంచి విదేశాలకు తరలిపోతే ఈ ఏడాది ఇప్పటికే 6500 మంది మిలియనీర్లు విదేశాలకు క్యూలు కట్టేశారు. వీరంతా భారత్‌లో అభద్రతా భావంతో బ్రతకలేమంటూ పేర్కొంటున్నారు. ఇటీవల నెలకొన్న నిరంతర రాజకీయ గందరగోళాన్ని కూడా ఓ కారణంగా చెబుతున్నారు. దుబాయ్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో సుస్థిర రాజకీయ వ్యవస్థలుండడం, శాంతిభద్రతల అదుపులో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం, అవినీతిని జీరో స్థాయికి నియంత్రించగలగడం, వీర్ని ఆ దేశాల వైపు ఆకర్షిస్తున్నాయి. దేశంలో పన్నుల విధాన సంక్లిష్టత కూడా వీరు విదేశాల వైపు చూసేలా చేస్తోంది.

ఒక్క భారతేకాదు.. చైనాలోని సంపన్నులు కూడా ఇప్పుడా దేశం నుంచి విదేశాల వైపు పరుగులుదీస్తున్నారు. చైనా, రష్యా, బ్రెజిల్‌ దేశాలు ఈ జాబితాలో ముందువరుస లో ఉన్నాయి. గత ఐదు దశాబ్ధాలుగా చైనా అనూహ్యరీతిలో ఆర్ధిక విజయాలు నమోదు చేస్తోంది. అయినా అక్కడి ప్రజల్లో సంతృప్తి కొరవడింది. రాజకీయ నియంతృత్వం కారణంగా స్వేచ్చాయుత జీవనానికి ప్రజలు నోచుకోలేక పోతున్నారు. ఈ దశలో సంపన్నులు తమకున్న అవకాశాల మేరకు పరుగులు దీస్తున్నారు. రష్యా, బ్రెజిల్లో కూడా ప్రభుత్వాల దమనకాండ, అణిచివేత ధోరణులు ప్రబలంగా ఉన్నాయి. స్వేచ్ఛాయుత జీవన విధానానికిక్కడ పరిధుల్ని నిర్దేశించారు. పరిమితికి లోబడి నియంత్రణ విధానాన్ని భరించలేని సంపన్నులు ఈ దేశాల్లోంచి బయటపడేందుకు వేగంగా అడుగులేస్తున్నారు.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పులకిది అద్దంపడుతోంది. ప్రజలిప్పుడు అభివృద్ది, సంక్షేమాలకంటే కూడా రక్షణ, భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. శాంతియుత జీవనాన్ని కోరుకుంటున్నారు. అవి లభ్యం కాని స్వదేశాల్ని వీడేందుకు వెనుకాడ్డంలేదు. ఒకప్పుడు జననీ జన్మభూమిశ్చ అని భావించేవారు. కానీ ఇప్పుడు అలాంటి సెంటిమెంట్‌ ప్రజల్ని కట్టిపడేయలేక పోతోంది. తమ ఆకాంక్షలు, లక్ష్యాలకనుగుణ మైన దేశాల వైపు పరుగులుదీసేలా ప్రోత్సహిస్తున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబీకులు బ్రతకలేని పరిస్థితులున్నా విదేశాలకెళ్ళగలిగే వెసులుబాటు కొరవడ్డంతో పాలకుల దమననీతిని భరిస్తూ ఇక్కడే కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement