Thursday, May 9, 2024

దేశంలో 6-8 వారాల పాటు లాక్ డౌన్ విధించాల్సిందే: ఐసీఎంఆర్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల్లో ఉంటే.. మరణాలు వేలల్లో ఉన్నాయి. కరోనా కట్టడికి దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, పాక్షిక లాక్‌డౌన్ విధించాయి. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ సత్ఫలితాలు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధనా మండలి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 2 నెలల పాటు లాక్‌ డౌన్ విధించాలని స్పష్టం చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని ఐసీఎంఆర్ కేంద్రానికి సూచించింది.  పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గిని తర్వాతే ఆంక్షలు సడలించవచ్చని  ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు. పాజిటివిటీ రేటు తగ్గాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్‌ అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 718 జిల్లాల్లో మూడో వంతు జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందని వివరించారు. వీటిలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలు కూడా ఉన్నాయని తెలిపారు.  ఢిల్లీలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

కాగా, దేశంలో నిన్న‌ కొత్త‌గా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,93,82,642 మంది కోలుకున్నారు. 37,04,099 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,52,35,991  మందికి వ్యాక్సిన్లు వేశారు.

ఇదీ చదవండి: పాతబస్తీ నుంచి కరోనా పరార్..!

Advertisement

తాజా వార్తలు

Advertisement