Wednesday, May 8, 2024

కోమ‌టిరెడ్డి మాట‌ల వెనుక మ‌ర్మం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి? రాజకీయవర్గాల్లో ఇదే చర్చ! పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసి ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని తొలుత భావించినా అంతకుమించి లోతైన మర్మం ఇంకేదో ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేయడమే కాకుండా, అటు భారాసను ఒత్తిడికి గురి చేయడం ఇటు భాజపాకు పరోక్షంగా హెచ్చరిక కూడా పంపారని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ పాదయాత్ర సందర్భంగా విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేవిధంగానే ఉన్నాయి. ఏ ఒక్కరూ కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చలేరని పేర్కొనడం పరోక్షంగా ఆయన నాయకత్వాన్ని తాము అంగీకరించలేమని చెప్పడమేనని విశదమవుతోంది. ఒకవేళ ఏ ఒక్కరో కాంగ్రెస్‌ను గెలిపించేటట్టయితే, మిగిలిన నాయకులంతా పనిచేయకుండా ఇళ్లలో కూర్చుంటారని చెప్పడం కూడా ఆయన మనోగతం చెప్పకనే చెబుతోంది.

అలాగే, ఏ ఒక్క రాజకీయపార్టీ సొంతంగా 60 సీట్లు గెలుచుకోలేదని, కాంగ్రెస్‌ కూడా అందరూ కలిసి పనిచేస్తే 40 సీట్లు గెలవవచ్చని చెప్పడం వెనుక కూడా మరో అర్ధం ఉందని చెబుతున్నారు. పరోక్షంగా భారాసకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మెజారిటీ రాదని చెబుతూ ఆ పార్టీని ఒత్తిడిలోకి నెట్టడమేనని అంటున్నారు. పైగా రాష్ట్రంలో లౌకిక సర్కారే ఏర్పడుతుందని చెప్పడం పరోక్షంగా భారాసతో సంకీర్ణానికి సిగ్నల్స్‌ ఇవ్వడమేనని అంటున్నారు. అయితే, ప్రి పోల్‌ అలయన్స్‌ ఉండదని చెప్పినప్పటికీ అది రాజకీయ ఎత్తుగడల్లో భాగమే.
ఇక భాజపాకు కూడా పరోక్షంగా సిగ్నల్స్‌ పంపారు. ఆయన సోదరుడు ఆ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. భాజపా అధికారంలోకి వస్తే అది వేరే సంగతి. రాకపోతే కనీసం భారాస, కాంగ్రెస్‌లు కలిసి ముందుకు సాగడానికి ఆయన వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయని పరిశీలకుల అంచనా.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో బయట కాక రేపుతున్నాయి. కోమటిరెడ్డి ప్రకటనపై కాంగ్రెస్‌ సీనియర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్ర సంచలనంగా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలఫై స్పందించిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ- ఆయనకు నోటీ-సులు జారీ చేసింది. ఐదు రోజుల్లో నోటీ-సుకు సమాధానం ఇవ్వాలని కమిటీ- చైర్మన్‌ జి చిన్నారెడ్డి నోటీ-సులో పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయంలో కలిసి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని మాత్రమే చెప్పానని, వచ్చే ఎన్నికల్లో భారాసతో పొత్తు పెట్టు-కుంటామని అనలేదని పేర్కొన్నారు. తెలంగాణాలో హంగ్‌ వస్తుందని కూడా అనలేదని, కావాలనే తాను చేసిన ప్రకటనను భాజపా వక్రీకరించి రాద్ధాంతం చేస్తోందని వెంకట్‌ రెడ్డి చెప్పినట్టు- సమాచారం. వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కొట్టి పారేస్తుండగా కాంగ్రెస్‌తో కలిసి అధికారాన్ని పంచుకునే ప్రశ్నే లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు- సాధించి హ్యాట్రిక్‌ కొడతామని భారాస నేతలు ప్రకటించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి రెండు పార్టీలు ఒక తాను ముక్కలేనని విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయన్న విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, అది కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నిజమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ- చేసి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్‌ పార్టీకి ఈ ప్రకటనతో ఏ మాత్రం సంబంధం లేదని పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. వరంగల్‌లో తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దిగుతుందన్న విషయాన్ని ప్రకటించారని అందుకు పూర్తి స్థాయి లో కేట్టు-బడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ చెప్పిందే ఫైన‌ల్..
వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాను చూడలేదని, అవి చూసాక స్పందిస్తానని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పొత్తుల విషయంలో తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పిందే అంతిమం అని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement