Monday, May 6, 2024

వరంగల్‌లో హెల్త్‌ సిటీ.. దేశంలోనే మొదటి హెల్త్‌ ప్రొఫైల్‌ జిల్లాగా ములుగు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: రాష్ట్రంలోని పేదలందరికీ కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లా పేదలందరికి మెరుగైన వైద్యసేవలు అందించాలని 1100 కోట్ల రూపాయలతో హెల్త్‌ సిటీని నిర్మాణం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు జిల్లాలో హెల్త్‌ ప్రొఫైల్‌ ఫైలెట్‌ ప్రాజెక్టు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి హరీష్‌రావు ప్రారంభించారు. ములుగు జిల్లాలో నిర్మాణమైన 250 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.
అనంతరం వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో 66 కోట్ల వ్యయంతో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే టి.డయాగ్నస్టిక్‌ సెంటర్‌ పనులకు కూడా శంకుస్థాపన చేయడంతో పాటు 26 హెల్త్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నర్సంపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడోత్సవాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం నర్సంపేట, పరకాలలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

దేశంలోనే మొదటి హెల్త్‌ ప్రొఫైల్‌ జిల్లాగా ములుగు..

18 సంవ త్సరాలు పైబడిన 2 లక్షల 60 వేల మందికి పూర్తి స్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించి డిజిటల్‌ హెల్త్‌ కార్డును అందిస్తున్న అద్బుతమైన కార్యక్రమం దేశంలోనే ములుగు, సిరిసిల్ల జిల్లాలు మొదటిస్థానంలో నిలుస్తాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. 40 రోజుల్లో వైద్యపరీక్షలు పూర్తిచేయడం జరుగుతుం ద ని ఇందుకోసం 10 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా 60 లక్షల రూపాయల వ్యయంతో రేడియాలజీ ల్యాబ్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఒక గ్రామ పంచాయతీని జిల్లాగా చేసిన ఏకైక సంఘటన ములుగులో తప్ప మరెక్కడ లేదన్నారు. ములుగులో గిరిజన విశ్వవి ద్యాలయానికి ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా మొన్ననే 20 కోట్లు మంజూరు చేసిందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ములుగుకు మెడికల్‌ కళాశాలను ఇవ్వడంపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ ద్వారా శుభవార్త వింటారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో రెండు 350 పడకల ఆసుపత్రులు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు, నర్సంపేట కేంద్రాలల్లో 350 పడకల సామార్ద్యంతో కూడి న ఆసుపత్రులను ని ర్మాణం చేయడం జరుగుతుందన్నారు. ఈ ఆసుపత్రుల నిర్మాణాలతో పేదలకు అన్ని రకాలవైద్యసేవలు, వరంగల్‌కు వెళ్లకుండా ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకు అవసరమైన వైద్యులను, సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. టి. డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ద్వారా 57 రకాల ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నర్సంపేటలో ఒకేసారి 26 సబ్‌ సెంటర్ల నిర్మాణానికి నిధులు ఇవ్వగా, మరో 13 ఏఎన్‌ఎం, సబ్‌ సెంటర్లకు కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు హరీష్‌రావు ప్రకటించారు. పరకాలలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.

- Advertisement -

మహిళా దినోత్సవం కానుకగా రూ. 500 కోట్ల వడ్డీలేని రుణాలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తం గా ఉన్నటువంటి మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు రైతుబంధు, రైతుభీమా, మహిళలకు కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌, కేసీఆర్‌ కిట్టు లాంటి ఎన్నో వినూత్న పథకాలను అందించడంతో పాటు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నారన్నారు. దేశంలోనే అద్భుతంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. వీటిని ఏవీ కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకుండానే అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.

బీజేపీ నేతలను నీలదీయండి..

దేశంలోనే అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే వాటిని సహకరించకపోగా అడ్డుకుంటున్నటువంటి బీజేపీ నేతలను బట్టలు విప్పేటట్లు నిలదీయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర బీజేపీనేత ఒకరాయన కాళేశ్వరం -2వ టీఎంసీ పనులను ఆపివేయాలని కేంద్రానికి లేఖ రాసిన బీజేపీ నేతలకు బుద్దిచెప్పాలన్నారు. అంతేకాకుండా పెట్రోల్‌, డిజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచి రైతులను, ప్రజలపై మోయలేని బారం వేస్తున్న బీజేపికి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇస్తామన్న గిరిజన యూనివర్సిటీని, రైల్వే కోచ్‌ప్యాక్టరిని, బయ్యారం ఉక్కుకర్మాగాన్ని నిర్మించకపోగా, తెలంగాణలో అందిస్తున్న ఉచిత కరెంటును సంస్కరణల పేరుతో అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, రాష్ట్ర రైతు బంధు చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు పెద్ది సుద ర్శన్‌రెడ్డి, సీతక్క, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌, నన్నపునేని నరేందర్‌, జెడ్పీ చైర్మన్‌లు కుసుమ జగదీష్‌, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement