Thursday, May 2, 2024

ఈటల అనుచరులపై గంగుల ఫోకస్!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ స్పీడ్ పెంచారు. ఈటల రాజేందర్​ సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్​ లో మంత్రి గంగుల రాజకీయం మొదలుపెట్టారు. కేబినెట్​ నుంచి ఈటల బర్తరఫ్​ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ హైకమాండ్​ అప్రమత్తమైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్​ నాయకులు, ఈటల అనుచరులపై ఫోకస్ పెట్టారు.

హైకమాండ్​ సూచనల మేరకు కరీంనగర్​కు చెందిన గంగుల కమలాకర్ హుజూరాబాద్​ నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఓ వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని,  హైకమాండ్​ వెంట నడిస్తే ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజేందర్​ టీఆర్‌‌ఎస్​ను వీడితే ఆయనకే నష్టం తప్ప పార్టీకి ఎలాంటి ప్రాబ్లమ్​ లేదన్నారు. వ్యక్తులు ఉంటారు పోతారు కానీ పార్టీ శాశ్వతమని మంత్రి హితబోధ చేశారు. పార్టీ వెంట నడిచే లీడర్లకు, కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలోపేతమవుతోందని, తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ఇప్పటికిప్పుడు హుజూరాబాద్​లో ఎన్నికలు జరిగినా టీఆర్​ఎస్​ గెలుస్తుందని, ఎవరిని నిలబెట్టినా కేసీఆర్​ ఫొటోతో విజయం సాధిస్తారని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్‌‌లో మాజీ మంత్రి ఈటలకు అనుచరులంటూ లేకుండా చేయాలనేది హైకమాండ్ ​ప్లాన్​గా కనిపిస్తోంది. సీఎం డైరెక్షన్ మేరకే కరీంనగర్​జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈటల అనుచరులను నయానో భయానో తమదారికి తెచ్చుకునేందుకు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే బుజ్జగింపుల కంటే ముందు లీడర్లను భయపట్టే ప్రయత్నం చేశారు.ఈక్రమంలోనే ఈటల వెంట తిరిగిన  వీణవంక జడ్పీటీసీకి కేడీసీసీ బ్యాంకు నుంచి నోటీసులు పంపించారు. ఈటలతో సన్నిహితంగా ఉన్నాడనే కారణంతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజపై జంట హత్యల కేసును తిరగదోడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా హైకమాండ్​ను ఎవరు వ్యతిరేకించినా ఇదే గతి పడుతుందనే హెచ్చరిక పంపించారు.

కాగా, ఈటల రాజేందర్ హుజురాబాద్ శానసభా సభ్యత్వానికి ఇప్పుడిప్పుడే రాజీనామా చేసే పరిస్థితి లేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత రాజీనామాపై ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆయన కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన శామీర్ పేటలోని తన నివాసంలో వివిధ వర్గాలతో, పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. తర్వలోనే పార్టీకి సంబంధించిన విషయాలను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement