Monday, April 29, 2024

నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు..

దేశంలో పాత రూ.500, రూ.1000 రూపాయల నోట్లను రద్దు చేసిన నేటికి ఐదేళ్లు పూర్తయింది. నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను 2016 నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేశారు. రద్దు అయిన పాత్ నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2 వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. అయితే, నోట్లు రద్దై ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజును బ్లాక్ డే అంటూ వాళ్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి 2016, నవంబర్ 8 పునాది అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మోదీ సర్కార్ ను టార్గెట్ చేశారు. నోట్ల రద్దు ఒక పెద్ద డిజాస్టర్ అని ఆమె అన్నారు. నోట్ల రద్దు తర్వాత కూడా అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట ఎందుకు పడలేదని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం విజయవంతం అయితే, అవినీతి ఇంకా ఎందుకు కొనసాగుతోందని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్యాష్ లెస్ ఎందుకు కాలేదన్న ప్రియాంక.. టెర్రరిజం ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement