Saturday, April 27, 2024

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు

ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు కంటే కరోనా బాధితుల నుంచి అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, రాష్ట్ర ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి సప్లయర్స్ నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ సమావేశం… కన్వీనర్, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం జరిగింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు సుచరిత, కన్నబాబు, ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆయన మాట్లాడారు.  కోవిడ్ నివారణ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న కరోనా కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు చేయడానికి మంత్రుల సబ్ కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేశారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. మంత్రుల సబ్ కమిటీలో కేసులు ఇంకా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఆసుపత్రులు, కొవిడ్ సెంటర్ల సంఖ్య పెంచడంపైనా చర్చించామన్నారు. హెల్ప్ డెస్క్ ల ఏర్పాటుతో పాటు  104 కాల్ సెంటర్ బలోపేతం చేయడంపైనా చర్చించామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు కంటే ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.

ఆసుపత్రుల నిర్వహణ, మందుల పంపిణీ విషయంలో అత్యంత సమర్థతో వ్యవహరిస్తున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఆక్సిజన్ కొరత నివారణకు అవసరమైన చర్యలపైనా చర్చించామని ఆయన తెలిపారు. ఏపీలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కోడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రోజూ 360 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు చెబుతున్నారన్నారు. కేసులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మరో 100 నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు. ఆ మేరకు కొరత రానివ్వకుండా ఒడిశా, తెలంగాణ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆక్సిజన్ సప్లయర్స్ తో మాట్లాడుతున్నామన్నారు. డిమాండ్ కు తగిన సప్లయ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కువ ఆక్సిజన్ నిల్వలు కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశాలించాలని అధికారులను సీం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 

వాక్సినేషన్ లో ఏపీ ముందుందని, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ చేశామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఒకే రోజు 6 లక్షల మందికి పైగా వాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెట్ వర్క్ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. కేంద్రమిచ్చిన వాక్సిన్ ను ప్రజలకు సమర్థవంతంగా అందజేస్తున్నామని వెల్లడించారు. కేంద్రమిచ్చిన వాక్సినేషన్ ను ఒకటి రెండ్రోజుల్లో పంపిణీ చేసే నెట్ వర్క్ ఏపీలో ఉందన్నారు. 

- Advertisement -

కరోనా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. సబ్ కమిటీలో చర్చించిన విషయాలను సీఎం తో జరగబోయే సమావేశంలో వివరిస్తామన్నారు. ప్రజలు భయాందోళనలకు గురకావొద్దని, కరోనా నియంత్రణకు సీఎం జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్.. ప్రతి రోజూ సమీక్షలు చేస్తూ అధికారులను, తమను అప్రమత్తం చేస్తున్నారన్నారు. కరోనా కట్టడిలో సీఎం జగన్ చేసే పోరాటానికి ప్రజల మద్దతు ఉంటేనే విజయం సాధించగలమన్నారు.

ప్రస్తుత వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చూపొద్దని, తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొస్తే…భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులు శానిటైజేషన్ చేసుకోవాలని వివరించారు. వ్యక్తిగత జాగ్రత్తలే కరోనా నివారణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. టెస్టుల చేసిన తరవాత ఫలితాలను త్వరితగతిన ఇచ్చేలా అధికారులను ఆదేశించామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు నిబంధనల ప్రకారం అర్హులైన వారంతా కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆళ్ల నాని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement